కరీంనగర్ జిల్లా వేములవాడ టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తన
పౌరసత్వం రద్దుపై హైకోర్టును ఆశ్రయించారు. చెన్నమనేని మోసపూరితంగా భారత
పౌరసత్వం పొందారని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హోంశాఖకు గతంలో ఫిర్యాదు
చేశారు. చెన్నమనేని రమేశ్ 1993 లో జర్మనీ పౌరసత్వం పొందారు. అప్పుడే ఆయన
భారత పౌరసత్వం రద్దు చేసుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం
2008లో తిరిగి భారత పౌరసత్వంకోసం దరఖాస్తు చేసుకున్నారని, నిబంధనల ప్రకారం
దేశంలో 365 రోజులు నివశించాలని, అప్పుడే పౌరసత్వం పొందే వీలవుతుందని
శ్రీనివాస్ వాదించారు. దీనిపై విచారణ జరిపిన హోం శాఖ రమేశ్ పౌరసత్వం
చెల్లదని ప్రకటించింది. తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం
ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్ వేశారు. రేపు ఈ పిటిషన్ ను
కోర్టు విచారించనున్నట్లు సమాచారం.