పెళ్లి పీటలపై ఆగిన పెళ్లి.. ఎందుకంటే...?
December 09,2019 10:44 AM
ఓ అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుని మరో అమ్మయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అయితే, నిత్య పెళ్ళికొడుకు బండారం కాస్తా బయటపడింది. మరో పెళ్లి జరుగుతుండగా నిశ్చితార్టం జరిగిన అమ్మాయి తరుపున బంధువులు ఎంట్రీ ఇచ్చారు.. అసలు విషయం తెలియడంతో వాళ్లు, వీళ్లు కలిసి దేహశుద్ధిచేశారు.. పెళ్లి ఆగిపోయింది.. చివరకు పెళ్లి కుమారుడు మోహన కృష్ణుడు.. శ్రీకృష్ణ జన్మస్థానం చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే... కర్నూలుకు చెందిన మోహన కృష్ణ తిరుపతిలో ఎస్బీఐ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.. అక్కడే ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. 16 లక్షల క్యాష్, 8 తులాల బంగారం కట్నంగా తీసుకున్నాడు. అయితే, కట్నం తీసుకున్నాక ఆమె అవసరం లేదనుకున్నాడో ఏమో.. తిరిగి నంద్యాలలో మరో అమ్మాయి లక్ష్మీ ప్రియతో వివాహం ఖాయం చేసుకున్నాడు. ఇక్కడ కూడా కట్న కానుకలు పుచ్చుకుని పెళ్లికి సిద్దమయ్యాడు. ఈ విషయం మొదటి అమ్మాయిల వాళ్లకు తెలిసింది.. తిరుపతి నుంచి అమ్మాయి బంధువులు వచ్చారు. వరుడు వ్యవహారం పందిట్లో పది మందికీ చెప్పారు. దీంతో అక్షింతలు వేయాల్సిన చేతులతో తలో ఒక దెబ్బా వేసి చితక్కొట్టారు. తమ ఆడపిల్లను మోసం చేసి.. కట్నం కాజేశాడని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు అమ్మాయిల తరపు బంధువులు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో కాసేపట్లో జరగాల్సిన పెళ్లి కాస్తా పెటాకులైంది. పెళ్లి పీఠలు ఎక్కాల్సినవాడు.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.