టూ వీలర్ వాహనదారులకు సంబంధించి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులు ఇక బీఐఎస్ మార్క్ ఉన్న హెల్మెట్ ను ధరించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ ను జారీ చేసింది. BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇదేంటంటే భారతదేశంలో తయారయ్యే వస్తువులకు ఎలాంటి ప్రమాణాలు ఉండాలో చెబుతుంది. ప్రస్తుతం దేశంలో విచ్చలవిడిగా హెల్మెట్ల తయారీ,అమ్మకాలు ఉన్నాయి.
కనీస ప్రమాణాలు పాటించకుండా హెల్మెట్ కంపెనీలు హెల్మెట్లు తయారు చేస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ పెట్టుకున్నా కూడా చాలా మంది మరణించారు. దీంతో కేంద్ర సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక నుంచి బీఐఎస్ మార్క్ లేనటువంటి హెల్మెట్లను తయారు చేసే వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. అదే విధంగా బీఐఎస్ మార్క్ లేని హెల్మెట్ ను పెట్టుకునే వారికి కూడా ఫైన్ తప్పదు. అంటే బీఐఎస్ మార్క్ లేని హెల్మెట్ పెట్టుకున్నా జరిమానా తప్పదు. హెల్మెట్ కు ఖచ్చితంగా బీఐఎస్ మార్క్ ఉండాల్సిందే. అందుకే కొత్త హెల్మెట్ కొనేటప్పుడు బీఐఎస్ మార్క్ ఉందో లేదో చూసి కొనుగోలు చేయాలి. ఇకపోతే ఈ కొత్త రూల్ 2021 మార్చి 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.