అమెరికా ఎన్నికల ఫలితాల్లో మోసం జరుగుతోందని…దీనిపై సుప్రీంను ఆశ్రయిస్తామని తెలిపారు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అమెరికా ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాకముందే ఈ ఎన్నికల్లో తామే గెలిచినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. వైట్‌హౌజ్ నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్.. ఎన్నికల కౌంటింగ్‌లో ఫ్రాడ్ జరుగుతోందన్నారు. మిలియన్ల సంఖ్యలో ఉన్న పోస్టల్ ఓట్ల కౌంటింగ్‌ను వెంటనే ఆపేయాలని కోరారు. దేశంలో సమగ్రతను అమలు చేయడమే తమ లక్ష్యం అని.. అమెరికా చరిత్రలో ఈ ఎన్నికలు అసాధారణమని, రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిందన్నారు. ఎన్నికల ఫలితాల ప్రక్రియపై కట్టుదిట్టమైన చట్టాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ అన్నారు. ఇది అత్యంత విషాదకర సమయమని, ఈ ఎన్నికలను తామే గెలవబోతున్నట్లు ట్రంప్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈసారి భారీ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లను అనుమతించారు. ఈ నేపథ్యంలోనే ఆలస్యంగా వచ్చిన పోస్టల్ ఓట్లను అనుమతించవద్దని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళుతానని ప్రకటించారు.