తిరుపతి పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయమై ప్రశ్నించిన జనసేన పార్టీ కార్యకర్తలపై, ఇతర పార్టీలపై భౌతిక దాడులకు దిగుతున్నారని పవన్ సీరియస్ అయ్యారు. ఇది ఇలానే కొనసాగితే మేము సహనం కోల్పోవాల్సి వస్తుందని పవన్ హెచ్చరించారు. మసీదులు, చర్చిలపై దాడులు జరిగితే రియాక్ట్ అయ్యేవారు, నేడు దేవాలయాలపై దాడులను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతాల కంటే మానవత్వం గొప్పదని తాము నమ్ముతున్నామని, అన్ని మతాలను గౌరవించాలని కోరుకుంటామని పవన్ తెలిపారు. ఇక తిరుపతి ఉప ఎన్నిక విషయమై తాము మరోసారి సమావేశం అయ్యాక మాట్లాడుతామని పవన్ తెలిపాడు.