‘ఆచార్య’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఖమ్మంలో జరగనుంది. ఈమేరకు ఖమ్మంలోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటికి విచ్చేసిన ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి , తనయుడు రామ్ చరణ్ లకి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వయంగా వారికి స్వాగతం పలికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువతో సత్కరించారు. షూటింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నందుకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఇల్లందులో ఆచార్య చిత్ర షూటింగ్ నిమిత్తం ఖమ్మంకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి , తనయుడు రామ్ చరణ్ లకి మంత్రి పువ్వాడ తన ఇంట్లో బస ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. రాంచరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. రాంచరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా రాంచరణ్, చిరంజీవి ఖమ్మం జిల్లా ఇల్లందు సింగరేణి బొగ్గు గనుల్లో కనిపించారు. ఈ తాజా షెడ్యూల్ మార్చి 7 మార్చి 15 వరకు షూటింగ్ జరగనుంది. ఇల్లెందులోని జేకే మైన్స్ లో ఓపెన్ కాస్ట్, భూగర్భ గనుల్లో చిరంజీవి, రామ్ చరణ్ లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.