మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇంతకు ముందు 'అతడు, ఖలేజా' వంటి సినిమాలు వచ్చాయి. టీవీల్లో ఎక్కువ సార్లు ప్రసారమైన చిత్రాలుగా అవి రికార్డ్ కూడా సృష్టించాయి. వీరిద్దరి కలయికలో మరో సినిమా దాదాపు సెట్ అయినట్టే. ‘సర్కారు వారి పాట’ పూర్తి కాగానే మహేష్ త్రివిక్రమ్ సినిమా మొదలవుతుందనే టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడని, దానికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ కూడా నిర్ణయించటం జరిగిందని అన్నారు. అయితే అది ఇప్పుడు ఆరంభం అయ్యే సూచనలు కనిపించటం లేదు. దీంతో త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. పూజ ఇంతకు ముందు మహేష్ తో ‘మహర్షి’, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాల్లో నటించింది. ఇప్పుడు మరోసారి మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో నటించటానికి ఓకె చెప్పినట్లు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటిస్తారట.