టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ మరే ఫ్యామిలీకి లేదంటే అతిశయోక్తి కాదు. మెగా ఫ్యామిలీలో దాదాపు డజను మందికి పైగా నటులున్నారు. వారిలో ఎవరి సినిమా వచ్చినా ప్రమోషన్ తారా స్థాయిలో ఉంటుంది. ఒకరి సినిమాకు మరొకరు ప్రమోషన్ చేస్తూ సహకరించుకుంటారు. అయితే ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన సూపర్ మచ్చి సినిమా మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మూవీలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించాడు.
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల భర్త అయిన కళ్యాణ్ దేవ్ గతంలో విజేత అనే సినిమాలో నటించాడు. ఇప్పుడు రెండో సినిమాగా సూపర్ మచ్చిలో నటించాడు. ఈ మూవీని మీడియం బడ్జెట్‌తోనే నిర్మించారు. భారీ క్యాస్టింగ్, తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు ప్రమోషన్లు చేయకపోవడంతో సంక్రాంతికి విడుదల చేసినా కలెక్షన్లు తీసికట్టుగా వచ్చాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఈ సినిమా సంధ్య థియేటర్లో విడుదల కాగా రూ.4వేలు, రూ.3వేలు కలెక్షన్లు మాత్రమే వస్తున్నాయంటే ఈ సినిమా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎవరెవరివో నటులకు సంబంధించిన ట్రైలర్లు, టీజర్లు విడుదల చేసే మెగా హీరోలు ఈ సినిమా విషయంలో పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటే మెగా ఫ్యామిలీలో ఏదో జరిగిందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సూపర్ మచ్చి ప్రమోషన్లకు హీరో కళ్యాణ్‌దేవ్ కూడా దూరంగా ఉండటం ఆ సినిమా నిర్మాతలకు మింగుడుపడని విషయంగా మారింది.