'మహానటి' తర్వాత యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఈరోజు అధికారికంగా లాంచ్ అయింది. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ, హరీష్ శంకర్, బుచ్చిబాబు సన తదితరులు హాజరయ్యారు. బుచ్చిబాబు సాన కెమెరా స్విచాన్ చేయగా, హరీష్ ఫస్ట్ క్లాప్ కొట్టారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ కాశ్మీర్లో మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. త్వరలో జరగనున్న షెడ్యూల్స్ కోసం టీమ్ హైదరాబాద్, వైజాగ్, అలెప్పీలకు వెళ్లనుంది. 'హృదయం' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.