ఈ కాలంలో.. డబ్బెవరికి చేదూ అన్నట్టు ఆ డబ్బుకోసం ఏ గడ్డి తినడానికైనా వెనుకాడని పరిస్థితి నెలకొంది. మరి అలాంటి డబ్బు కట్టలు కట్టలు ఓ కాలువలో కొట్టుకొస్తే.. ఇది చూసే వారు కలా నిజమా అనే సందిగ్ధంలో పడిపోతారు. ఇది మాత్రం నిజం కట్టల కొద్ది రెండువేల రూపాయల నోట్లు ఓ సరస్సులో తేలుతూ కనిపించాయి. రాజస్థాన్ లోని ఓ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు కొట్టుకురావడం స్థానికులను షాక్కు గురిచేసింది. పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లి వీటిని స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ అజ్మీర్ లోని ఆనాసాగర్ కాలువలో కొన్ని పాలిథీన్ బ్యాగులో రూ.2వేల నోట్ల కట్టలు కొట్టుకు వచ్చాయి. స్థానికులు ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు పాలిథీన్ బ్యాగులో ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని, అన్నీ రూ.2వేల నోట్లే అని అధికారులు చెప్పారు. అయితే ఈ నోట్లు నకిలీవా? లేక నిజమైనవా? అనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చూడటానికి మాత్రం నిజమైన నోట్ల లాగే ఉన్నాయని, నీటిలో తడవడం వల్ల నిర్ధారించుకోలేకపోతున్నట్లు చెప్పారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నోట్ల కట్టలను పాలిథీన్ బ్యాగులో పెట్టి కాలువలో విసిరేశారని వివరించారు. నిపుణుల సాయంతో నోట్ల అసలువో, కాదో తెలుసుకుంటామన్నారు అధికారులు.