మిషన్ భగీరథ అట్టర్ ఫ్లాప్ అని, ప్రధాని ఉన్న మాట చెబితే ఉలుకెందుకు కేసీఆర్ అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్. హర్ ఘర్ జల్ విషయంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీద టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బండి సంజయ్. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో ఇప్పటికీ వేలాది గ్రామాలకు ఇంటింటికీ మంచి నీళ్లు సరఫరా చేయలేకపోయినప్పటికీ 100 శాతం నీళ్లిస్తున్నట్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు అన్నారు. అట్టర్ ఫ్లాప్ మిషన్ భగీరథ స్కీంను దేశంలోనే నెంబర్ వన్ గా గుర్తించాలని చెప్పడం హాస్యాస్పదం. గాలి మాటలు చెప్పడంలో, పచ్చి అబద్దాలను ప్రచారం చేయడంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం వాళ్లకు వాళ్లే సాటి. హర్ ఘర్ జల్ పేరిట జల్ జీవన్ మిషన్ ప్రవేశపెట్టిన స్కీంను వంద శాతం అమలు చేసిన గోవా పేరును ప్రధానమంత్రి నరేంద్రమోదీగారు చెప్పగానే వీళ్లకు ఎక్కడా లేని కోపం పుట్టుకొచ్చింది. ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లుగానే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పదోవ పట్టించే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారు.
ప్రధాని గారు గోవా ఫస్ట్ అంటే.. కాదు కాదు.. 100 శాతం గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లిచ్చిన తెలంగాణే రాష్ట్రమే ఫస్ట్ అని ప్రగల్భాలు పలికారు. కానీ ‘హర్ ఘర్ జల్’ పథకం కింద రాష్ట్రంలోని 100 శాతం కుటుంబాలకు మంచి నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు గుర్తించాలంటే దానికి ప్రత్యేక మార్గదర్శకాలున్నాయి. రాష్ట్రంలోని 100 శాతం గ్రామాలు గ్రామ సభలు నిర్వహించాలి. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సమావేశమై తాము 100 శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చినట్లు తీర్మానాలు చేసి పంపితే అది ‘సర్టిఫైడ్ స్టేట్’ గా గుర్తిస్తారు. భారత దేశంలో సర్టిఫైడ్ లిస్ట్ లో స్టేట్/యూటీ జాబితాలో కేవలం గోవా, దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యు మాత్రమే ఉన్నాయి. తాము ఇస్తున్నామని రిపోర్ట్ చేసిన రాష్ట్రాలు/కేంద్రపాలిత రాష్ట్రాల లిస్టులో తెలంగాణతోపాటు అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, హర్యానా రాష్ట్రాలున్నాయి. కావాలంటే జల్ జీవన్ మిషన్ వెబ్ సైట్లో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. కానీ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇస్తున్నట్లు తీర్మానం చేయించి పంపే దమ్ముందా? నీకు నిజంగా చిత్తశుద్ది, దమ్ముంటే గ్రామ సభల్లో తీర్మానం చేయించి పంపాలి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వంద శాతం గ్రామాలకు మంచి నీళ్లు ఇస్తున్నట్లు గుర్తిస్తుందని అన్నారు బండి సంజయ్