తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు, తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే.. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 15 సీట్లను మాత్రమే గెలుస్తుందన్నారు. గెలిచే 15 సీట్లలో కేసీఆర్ ఉండరంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ని జైల్లో వేసే అవకాశం వస్తుందని, బీహార్ లో లాలుప్రసాద్ యాదవ్ చట్టపరంగా జైలుకు వెళ్ళలేదా ? అని ఆయన అన్నారు. న్యాయబద్ధంగా,చట్ట బద్ధంగా కేసీఆర్ ని జైల్ కి పంపుతామని ఆయన వెల్లడించారు. కేసీఆర్, కేసీఆర్ కుటుంబమే మాకు పెద్ద అస్త్రాలు… వేరే అంశాలు అవసరమే లేదని ఆయన పేర్కొన్నారు. పోటీ చేసే అంశం పై కొందరు వాళ్ళ వాళ్ళ అభిప్రాయం మాత్రమే చెబుతున్నారని… పార్టీ నిర్ణయమే ఫైనల్ అని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా గెలిచేది బీజేపీనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ లో బీజేపీ గెలిస్తే… దేశంలో సగం సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే నా పని.. పార్టీ పని అని ఆయన తెలిపారు. ఎవరు అడ్డుకున్నా.. పార్టీలో చేరికలు కొనసాగుతాయని, మోడీ నాయకత్వాన్ని బలపరిచే ఎవరినీ అయినా చేర్చుకుంటామన్నారు. చికోటి ప్రవీణ్ తో టీఆర్‌ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయని, రోజు ప్రెస్ మీట్ లు పెట్టి మమ్మల్ని తిట్టే టీఆర్‌ఎస్ నేతలకు ప్రవీణ్ తో సంబంధాలు ఉన్నాయని ఆయన విమర్శించారు.