ఏపీలో ఉద్యోగుల సంఘానికి హైకోర్ట్ ఊరట

0
134

ఏపీలో ఉద్యోగుల సమస్యల పై ఏపీ ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇటీవల కాలంలో వివిధ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో తరచూ భేటీ అవుతోంది. ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు తమను ఆహ్వానించకపోవడం పై హైకోర్టును ఆశ్రయించారు ఏపీ జీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ. తమను ఆహ్వానించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు సూర్యనారాయణ తరపు న్యాయవాది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కూడా ఆహ్వానించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకు కూడా దిగారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈసమావేశాల్లో అమరావతి జేఏసీ నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులకు వైసీపీ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, జీత భత్యాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించకపోవడం, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి హామీలు నెరవేర్చలేదు. దీంతో ఉద్యోగ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.ప్రభుత్వం ఇవాళ తమకు అనుకూలంగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరుపుతోంది. ఈ సమావేశాలకు మంత్రులతో పాటు సజ్జల, చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు (ఏపీ జేఏసీ అమరావతి), బండి శ్రీనివాసరావు (ఏపీ ఎన్జీవోలు), వెంకట్రామిరెడ్డి (సచివాలయ ఉద్యోగుల సంఘం)ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి ప్రభుత్వంతో విభేదిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో సూర్యనారాయణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజా ఆదేశాలతో ప్రభుత్వం ఏపీ జీఈఏని కూడా చర్చలకు ఆహ్వానించక తప్పదు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here