బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మహాఘటబంధన్‌లో భాగమైన వివిధ పార్టీల నుంచి మంగళవారం బిహార్ కేబినెట్‌లోకి మొత్తం 31 మంది మంత్రులు చేరారు. రాజ్‌భవన్‌లో బిహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్జేడీకి 16, జనతాదళ్ (యునైటెడ్)కి 11 మంత్రి పదవులు లభించాయి. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు శాసనసభ్యులు, జితిన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా నుండి ఒకరు, ఏకైక స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది. బిహార్ కేబినెట్‌లో గరిష్టంగా 36 మంది మంత్రులు ఉండే అవకాశం ఉండగా.. 31 మందికి మంత్రులగా అవకాశం ఇచ్చారు. భవిష్యత్తులో జరిగే మంత్రివర్గ విస్తరణ కోసం కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉంచబడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్న నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ సహా పలు పార్టీల కూటమితో పొత్తు పెట్టుకున్నారు. ఎన్డీయే కూటమి నుంచి నితీష్ కుమార్ బయటకు వచ్చి ఆగస్టు 9న సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇది జరిగిన కాసేపటికే మహాకూటమితో పూర్వ సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. ప్రత్యర్థి ఆర్జేడీ పార్టీతో మళ్లీ చేతులు కలిపారు. 7 పార్టీలతో కూడిన మహా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలంటూ గవర్నర్‌ను కోరారు. అందుకు ఆయన ఆమోదించడం వల్ల ఆగస్టు 10న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అదే రోజు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆర్జేడీ నుంచి ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, సమీర్ కుమార్ మహాసేత్, చంద్రశేఖర్, కుమార్ సర్వజీత్, లలిత్ యాదవ్, సురేంద్ర ప్రసాద్ యాదవ్, రామానంద్ యాదవ్, జితేంద్ర కుమార్ రాయ్, అనితా దేవి, సుధాకర్ సింగ్, అలోక్ మెహతా ప్రమాణం చేశారు. బిహార్ మహాకూటమి మొత్తం బలం 163. స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ నితీష్ కుమార్‌కు మద్దతు ఇవ్వడంతో దాని ప్రభావవంతమైన బలం 164కి చేరుకుంది. ఆగస్టు 24న బీహార్ అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకునే అవకాశం ఉంది.