విష్ణుకుమార్‌ రాజు సంచలనం.. టీడీపీ, బీజేపీ, జనసేన కలవడం అనివార్యం..!

0
109

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించలేకపోయింది.. అయితే, ఈ ఫలితాల తర్వాత బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు షాకింగ్‌ కామెంట్లు చేశారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై రాష్ట్ర నాయకత్వం అంతర్మథనం చేసుకోవాలని సూచించారు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక్కటేనన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయిందన్న ఆయన.. అందుకు ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనంగా చెప్పుకొచ్చారు.. వైసీపీతో ఉన్నామనే అభిప్రాయం కొనసాగితే భవిష్యత్తులో మరింత నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు విష్ణు కుమార్‌ రాజు.

రాష్ట్ర, కేంద్ర అధిష్టానం ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాలని సూచించారు విష్ణకుమార్‌ రాజు.. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు.. టీడీపీ, జనసేన, బీజేపీ కలవడం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు అనివార్యంగా పేర్కొన్నారు. ఒత్తిళ్ళు, ప్రలోభాలు పెట్టినా వైసీపీని ఆదరించకపోవడం ప్రజల్లో వస్తున్న మార్పుకు నిదర్శనంగా అభివర్ణించారు. మరోవైపు.. తెలంగాణలో బీజేపీ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిందని ప్రశంసలు కురిపించారు. పొలిటికల్ వ్యాక్యూ మ్ ను తెలంగాణ బీజేపీ అనుకూలంగా మార్చుకుంది. ఏపీలోనే టీఎస్ మోడల్ విధానాలు బీజేపీ ఎదుగుదలకు అవసరం అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌ రాజు. కాగా, జనసేనతోనే మా పొత్తు.. టీడీపీ, వైసీపీతో ఎలాంటి పొత్తులు ఉండబోవు అంటూ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సహా పలువురు నేతలు, పలు సందర్భాలో స్పష్టం చేశారు.. కానీ, జనసేన, బీజేపీ.. తెలుగు దేశం కలిసి పని చేయాలంటూ విష్ణు కుమార్‌ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here