ఏపీకి ప్రధాన వరంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఇటీవల పోలవరం ఎత్తు గురించి కేంద్రం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయంపై కేంద్రం వివరణ ఇచ్చింది. రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2017-18 ధరల ప్రకారం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 47,725 కోట్లు.
2019లో జలశక్తి శాఖకు వచ్చిన సవరించిన అంచనా వ్యయం 2017-18 ధరల ప్రకారం రూ. 55,548.87 కోట్లు. మారిన ఈ వ్యయ అంచనాలను జలశక్తి శాఖ అడ్వైజరీ కమిటీ అంగీకరించింది. 2020లో “రివైజ్డ్ కాస్ట్ కమిటీ” (ఆర్సీసీ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. “రివైజ్డ్ కాస్ట్ కమిటీ” సిఫార్సుల ప్రకారం అంచనా వ్యయం రూ. 47,725 కోట్లుగా నిర్థారించాం అని కేంద్రమంత్రి తెలిపారు. 2013-14 ధరల ప్రకారం ఈ అంచనా వ్యయం రూ. 29,027.95 కోట్లు. అంచనా వ్యయం పెరుగుదలలో భూసేకరణ, పరిహారం, పునరావాసం ఉంటాయన్నారు. ధరల్లో పెరుగుదలే ప్రధాన కారణం. 2014 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 13,463.21 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తిరిగి చెల్లింపులు చేసింది కేంద్ర జల సంఘం, “పోలవరం ప్రాజెక్టు అథారిటీ” లు చేసిన సిఫార్సులు మేరకు ఈ చెల్లింపులు చేశామని మంత్రి వివరణ ఇచ్చారు.