ఉత్తరాంధ్ర జాబ్‌ హబ్‌గా మారుతుంది..!

0
86

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఆ తర్వాత రూ. 23.73కోట్లతో చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ సాగర ప్రాజెక్ట్‌ పనులకు శంకుస్థాపన చేయనున్నాం. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్‌ హబ్‌గా మారుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు..

చింతపల్లిలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ను ప్రారంభించాం. అదానీ డేటా సెంటర్‌తో ఉత్తరాంధ్ర ముఖచిత్రమే మారుతుందన్నారు సీఎం జగన్‌.. భోగాపురం ఎయిరోపోర్టును 2026లో మళ్లీ మీ బిడ్డే వచ్చి ప్రారంభిస్తాడు. ఎయిర్‌పోర్టు తీసుకురావడానికి చిత్తశుద్ధితో పనిచేశాం అన్నారు.. కేవలం ఎన్నికలకు రెండు నెలల ముందే ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేశామని చెప్పుకున్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరు. కోర్టులో కేసు వేసి అడ్డుకోవాలని చూశారు. 2026 నాటికి రెండు రన్‌వేలతో ప్రాజెక్ట్‌ టేక్‌ ఆఫ్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.. మొదటి ఫేజ్‌లో 60 లక్షల జనాభాకు సదుపాయాలు సమకూరుస్తాం. చివరి దశకు వచ్చే సరికి 4కోట్ల ప్రజలకు సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఏ380 డబుల్‌ డెక్కర్‌ ఫ్లైట్‌ ల్యాండ్‌ అయ్యే ఏర్పాట్లు చేస్తాం అన్నారు.. ఇక, ఉద్ధానంలో కిడ్నీ రీసర్చ్‌ సెంటర్‌ పనులను పూర్తి చేశాం. జూన్‌ నెలలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను జాతికి అంకితం ఇస్తామని ప్రకటించారు సీఎం వైఎస్‌ జగన్‌.

ఇక, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ విశేషాల విషయానికి వస్తే.. రూ. 4,592 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో 36 నెలల్లో నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు రచించారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలు, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశల వారీగా సౌకర్యాలు విస్తరించనున్నారు.. చివరి దశకు వచ్చే సరికి 4 కోట్ల ప్రజలకు సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానున్నారు.. భూసేకరణ, టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి ఎన్‌వోసీ, పర్మిషన్‌లు తీసుకొచ్చి ఎన్‌జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయవివాదాలు పరిష్కరించింది ప్రభుత్వం.. పీపీపీ విధానంలో నిర్మించే విధంగా జీఎంఆర్‌ గ్రూపుతో ఏపీ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఏడిసీఎల్‌) ఒప్పందం చేసుకుంది.. ప్రయాణీకుల సౌకర్యార్ధం అత్యంత ఆధునికంగా ట్రంపెట్‌ నిర్మాణం, ఇటు విశాఖ, అటు శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయ టెర్మినల్‌కు చేరుకునేలా అనుసంధానం చేయనున్నారు.

అంతర్జాతీయ ఎగ్జిమ్‌ గేట్‌వే ఏర్పాటుకు వీలుగా కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్‌ ఎకో సిస్టమ్, తొలి దశలో 5,000 చ.మీ విస్తీర్ణంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్‌ అభివృద్ది చేస్తారు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రన్‌వే, కమర్షియల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ అప్రాన్, ప్యాసింజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్, ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌ అండ్‌ టెక్నికల్‌ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ది ప్లాంట్‌ ఏర్పాటు కాబోతోంది.. 16 వ నెంబర్‌ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణం, కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా, కమర్షియల్‌ అప్రోచ్‌ రోడ్, సోలార్‌ ప్యానెల్స్‌ ఏరియా, ఏవియేషన్‌ అకాడమీ, మెయింటెనెన్స్‌ రిపేర్‌ అండ్‌ ఓవర్‌ హాలింగ్‌ సౌకర్యాలు కల్పించనున్నారు.. విశాఖపట్నం–భోగాపురం మధ్య రూ. 6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి నిర్మాణం, రెండువైపులా సర్వీసు రోడ్లు నిర్మించనున్నారు.. ఎయిర్‌పోర్టు నిర్మాణ సమయంలో 5 వేల మందికి, సేవలు ప్రారంభం అయిన తర్వాత 10 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి, పర్యాటక అభివృద్ది, ఇతర పెట్టుబడుల ద్వారా మరో 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here