తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు అల్లుడు… మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి భర్త. మాజీ సీఎం చంద్రబాబునాయుడుకి తోడల్లుడు. ఒకప్పుడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన దగ్గుబాటి సంక్రాంతి వేళ కీలక ప్రకటన చేశారు. ఒకవైపు ఏపీ రాజకీయాలు వేడెక్కిన వేళ తన రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన సీనియర్ పొలిటీషియన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. రాజకీయాలకు నేను నాకుమారుడు హితేష్ స్వస్తి చెబుతున్నాం.. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మేము ఇమడ లేము అన్నారు.
డబ్బుతో నడిచే రాజకీయాలు మనస్సు చంపుకొని చేయలేము..ప్రజా సేవ చేయాలనుకుంటే పదవులు లేకున్నా సొంతంగా చేస్తామన్నారు. ఇప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు లేవు అన్నారు. దగ్గుబాటి వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. తాను, తన కుమారుడు హితేష్ రాజకీయాలకు స్వస్తి చెబుతున్నామని మాజీ మం దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించడంపై ఇంకా ఎవరూ స్పందించలేదు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ వేదికపై ఈ ప్రకటన చేయడం ప్రాధాన్కత సంతరించుకుంది. శనివారం ఆయన ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇంకొల్లుతో తనకున్న అనుబంధంతో ఇక్కడ తన మనసులోని మాట చెప్పానని వివరించారు. డబ్బుతో రాజకీయం, కక్ష సాధింపులకు దిగటం తమ కుటుంబానికి అలవాటు లేదన్నారు. గతంలో రాజకీయాలకు నేటికీ పొంతన లేదని.. అందుకే హితేష్, తానూ రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగుతున్నామని దగ్గుబాటి తెలిపారు. దగ్గుబాటి సతీమణి పురందేశ్వరి బీజేపీలో కొనసాగుతున్నారు.