దళితుడిని స్తంభానికి కట్టేసి.. హింసించి.. గుండు కొట్టించి, ముఖాన్ని నల్లగా చేసి..

0
85

దళితులపై అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ బహ్రైచ్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ దళిత యువకుడికి తీవ్రంగా కొట్టి, గుండు కొట్టించి.. ముఖాన్ని నల్లగా మార్చారు. దళితుడు అయినందువల్లే ఇలా చేశారని కుటుంబసభ్యులు వాపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో దొంగతనానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో దళితుడిని కొట్టి, గుండు కొట్టించి, ముఖం నల్లగా చేశారు. బహ్రైచ్ జిల్లాలోని హార్దియా ప్రాంతంలోని ఓ ఇంట్లో టాయిలెట్ సీటును దొంగిలించాడనే ఆరోపణతో ముగ్గురు వ్యక్తులు యువకుడిని స్తంభానికి కట్టివేశారు. దినసరి కూలీ రాజేష్ కుమార్‌పై గుంపు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేష్‌ కుమార్‌ను పోలీసులకు అప్పగించడానికి బదులు అతడిని కట్టేసి తీవ్రంగా దాడి చేశారు. యువకుడి కనుబొమ్మలు బ్లేడ్‌తో గీకేశారు. సగం మీసాన్ని తీసేయడంతో పాటు గుండు కొట్టించారు. కోటియా గ్రామానికి చెందిన ముగ్గురిపై దాడి, నేరపూరిత బెదిరింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అట్రాసిటీ చట్టం నిబంధనల ప్రకారం వారిపై కేసు నమోదైంది. స్థానిక బీజేపీ నేత రాధేశ్యామ్ మిశ్రా, అతని సహాయకులు రేణు వాజ్‌పేయ్, రాకేష్ తివారీలను ఈ దాడికి పాల్పడిన నిందితులుగా గుర్తించారు. పోలీసులు ఇద్దరు సహాయకులను అదుపులోకి తీసుకున్నారు. మిశ్రా పరారీలో ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని, ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. రాజేష్ దొంగతనానికి వచ్చానని నిందితులు పోలీసులకు తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here