రేపే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు.. సర్వం సిద్ధం

0
65

ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 250 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనుండగా.. 13,638 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 68 మోడ‌ల్ పోలింగ్ స్టేష‌న్లు, 68 పింక్ స్టేష‌న్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. 1349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సహా మిగతా పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికలను బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఉత్కంఠ పోటీ నెలకొననున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో 1.45 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓట‌ర్లు 78,93,418, మ‌హిళా ఓట‌ర్లు 66,10,879, ట్రాన్స్‌జెండ‌ర్ ఓట‌ర్లు 1,061 మంది ఉన్నారు. డిసెంబ‌ర్ 7వ తేదీని ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది.

వార్డుల పునర్విభజన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కానున్నాయి. భద్రత పరంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల భద్రతా విధుల్లో 30 వేల భద్రతా సిబ్బంది పాల్గొననున్నారు. వీరిలో సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీస్, హోంగార్డులున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువమంది సాయుధ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగే ఆదివారం రోజు ఉదయం నాలుగున్నర నుంచే మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. అలాగే, ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా మద్యం విక్రయాలపై ఢిల్లీలో నిషేధం విధించారు. శుక్రవారం సాయంత్రం 5గంటల 30 నిమిషాల నుంచి ఆదివారం ఎన్నికలు ముగిసే వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. ఓట్ల లెక్కింపు జరిగే డిసెంబర్ 7వ తేదీన కూడా ఆల్కహాల్ అమ్మకాలపై నిషేధం ఉండనుంది.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఒపీనియ‌న్ పోల్స్ నిర్వహించ‌కూడ‌ద‌ని ఎన్నిక‌ల సంఘం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. డిసెంబ‌ర్ 2వ తేదీ సాయంత్రం 5:30 గంట‌ల నుంచి డిసెంబ‌ర్ 4వ తేదీ సాయంత్రం 5:30 వ‌ర‌కు ఒపీనియ‌న్ పోల్స్‌పై నిషేధం విధించింది. గత 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏకీకృత సంస్థగా ఉన్నప్పుడు 2007 ఎన్నికల్లో విజయం సాధించింది. 2012లో విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 2017లో జరిగిన ఎన్నికల్లోనూ కమలం పార్టీ విజయం సాధించింది. 2017లో 272 వార్డులకు ఎన్నికలు జరగగా.. తూర్పు, ఉత్తరం, దక్షిణం అనే మూడు కార్పొరేషన్లలో బీజేపీ 181 సీట్లు గెలుచుకోగా, ఆప్ 49, కాంగ్రెస్ 31 స్థానాల్లో విజయం సాధించింది. కాగా ఈ సారి డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మునిసిపల్ వార్డుల సంఖ్యను 250కి తగ్గించింది. మరోవైపు.. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో తొలిసారి పాగా వేయాలని ఆశిస్తోంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఆదివారం దేశ రాజధానిలో అన్ని మార్కెట్లు మూసివేయబడతాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ ఇవాళ తెలియజేసింది. మార్కెట్‌ను మూసి ఉంచాలని మార్కెట్ యూనియన్‌లు, సీటీఐ పరస్పరం నిర్ణయించుకున్నాయని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here