టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది : డీకే అరుణ

0
47

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నిరుద్యోగుల పక్షాన ఆందోళన చేస్తున్న బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ తప్పిదాలవల్ల లక్షలాది మంది నిరుద్యోగులకు జరుగుతున్న నష్టాన్ని ఎత్తిచూపుతూ నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు అని, ఆ హక్కును కాలరాసేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. గ్రూప్-1 పేపర్ సైతం లీక్ అయ్యిందని, దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలొస్తున్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు జరిపి చిత్తుశుద్ధి నిరూపించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా తప్పులను ఎత్తిచూపుతున్న వాళ్లపై అమానుషంగా వ్యవహరిస్తూ నిరసనకారుల గొంతునొక్కుతుండటం సిగ్గు చేటని ఆమె ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేసీఆర్ ఖాసీం రజ్వీని మించిపోయారని, అరెస్ట్ చేసిన బీజేవైఎం కార్యకర్తలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగ పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయిందని, కేసీఆర్ సర్కార్ చేతగానితనానికి నిదర్శనమిదని ఆమె వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా.. ‘ప్రభుత్వ తప్పిదాలవల్ల గతంలో ఇంటర్మీడియట్, ఎంసెట్ విద్యార్థులు సైతం ఇబ్బంది పడ్డారు. సీఎం కొడుకు నిర్వాకంతో 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు బలయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉద్యోగాలను భర్తీ చేయాలనే చిత్తశుద్ధి లేదు. అందులో భాగంగానే నోటిఫికేషన్ మొదలు పరీక్షలు, ఇంటర్వ్యూలు, నియామకాల దాకా రకరకాల ఇబ్బందులు స్రుష్టిస్తున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వేసిన ప్రతిసారి కోర్టుకు వెళ్లే అవకాశమిచ్చేలా లోపాలను జోడిస్తున్నారు. ఒకవేళ ఎవరూ కోర్టుకు వెళ్లకపోతే.. ప్రశ్నాపత్రం లీకేజీలతో లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాడమాడుతున్నారు. ఒక పేపర్ ప్రశ్నాపత్రం లీకేజీపై విచారణ చేస్తుంటే ఇంకో ప్రశ్నాపత్రం లీకేజీ అంశం వెలుగులోకి వస్తోంది. సమగ్ర విచారణ జరిపితే ఇంకెన్ని లీకులు బయటపడతాయో… అవినీతి కూపంలో నిండా మునిగిపోయిన కేసీఆర్ సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.’ అని ఆమె అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here