Molestation in Moving Car in Bangalore: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. కదులుతున్న కారులో ఓ యువతిపై నలుగురు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. బెంగళూరు నగర నడిబొడ్డున ఓ యువతిని ఆమె బాయ్‌ఫ్రెండ్ ముందే కారులో కిడ్నాప్ చేసి పలు ప్రాంతాల్లో సంచరిస్తూ కొన్ని గంటల పాటు అత్యాచారం చేయడం కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే.. బెంగళూరులోని ఈజీపురకు చెందిన ఓ యువతి, తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మార్చి 25న రాత్రి 9.30 గంటల సమయంలో కోరమంగళలోని పార్కులో కూర్చుంది. ఇద్దరూ సిగరెట్ తాగుతుండగా దగ్గర్లోనే కూర్చున్న ఓ యువకుడు పొగతో ఇబ్బందిగా ఉందంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిన అతడు, మరో ఇద్దరు స్నేహితులతో తిరిగి వచ్చాడు. బెదిరించి యువతి స్నేహితుడిని అక్కడి నుంచి పంపించివేశారు. తర్వాత రాత్రి 11 గంటల సమయంలో మరో స్నేహితుడు రాగా.. వారందరూ కలిసి ఆ యువతిని కేఏ 01 ఎంబీ 6169 నెంబర్ గల మారుతీ 800 కారులో కిడ్నాప్ చేశారు. రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు అదే కారులో నిరంతరం ఆ యువతి మీద నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు.
కామం తీర్చుకున్న యువకులు రోడ్డు పక్క ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం.. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరిపి కిరణ్, శ్రీధర్, విజయ్, సతీష్ అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరూ ఈజీపురకు చెందినవారేనని పోలీసులు వెల్లడించారు.