టెన్షన్ వద్దు.. నేను చూసుకుంటూ, వదిలేయ్: హార్దిక్ పాండ్యా

0
137

ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి ఇండియా-పాకిస్థాన్‌ల మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గత టీ20 ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారంగా టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ గెలుపులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్రను పోషించాడు. అటు బ్యాట్‌తోనే కాకుండా.. బంతితో కూడా అద్భుతంగా రాణించాడు. మొదటి బ్యాటింగ్ చేసిన పాక్‌ను కట్టడి చేయడంలో భువనేశ్వర్ (4/26)కు తోడుగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య (3/25) కీలక పాత్ర పోషించాడు. క్రీజులో కుదురుకున్న ఓపెనర్‌ రిజ్వాన్‌ (43), ఇఫ్తికార్‌ అహ్మద్ (28)తోపాటు ఖుష్‌దిల్‌ (2)ను పెవిలియన్‌కు చేర్చాడు. అప్పటికే రిజ్వాన్- ఇఫ్తికార్‌ 45 పరుగులు జోడించి మంచి ఊపు మీదున్నారు. షార్ట్‌ పిచ్‌ బంతులను ఆడటంలో విఫలమవుతున్న పాక్‌ బ్యాటర్లను ఆ అస్త్రంతోనే బోల్తా కొట్టించాడు. గత భారత టీ20 లీగ్‌ ముందు వరకు బౌలింగ్‌ వేసేందుకు ఇబ్బంది పడి విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్‌ తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. పాండ్య బౌలింగ్‌ను మెచ్చుకుంటు కెప్టెన్ రోహిత్ శర్మ చేతులు కలిపిన ఓ ఫొటో వైరల్‌గా మారింది.

మొదటి టీమిండియా బ్యాటింగ్‌లో కాస్త తడబడింది. ఒక్కపరుగుకే తొలి వికెట్ పడడంతో.. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(35), రోహిత్ శర్మ(12) స్కోరు బోర్డును నడిపించారు. అనంతరం స్వల్ప వ్యవధిలోని వీరిద్దరూ ఔటయ్యారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ కూడా పెవిలియన్ చేరాడు. మరోవైపు రవీంద్ర జడేజా (35) క్రీజ్‌లో పాతుకుపోయి ఆడుతున్నాడు. ఇలాంటి సమయంలో మరొక వికెట్‌ పడి ఉంటే భారత్‌ పరిస్థితి వేరేలా ఉండేది. కానీ హార్దిక్‌ పాండ్య ఏమాత్రం బెదరకుండా పాక్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. జడేజాతో కలిసి 52 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశాడు. భారీ ఒత్తిడి ఉండే ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టేసి టీమ్‌ఇండియాపై భారాన్ని కాస్త దించేశాడు. కానీ చివరి ఓవర్‌లో అసలైన డ్రామా మొదలైంది.

చివరి ఓవర్‌లో మొదటి బంతికే జడేజా ఔట్ కావడం.. తర్వాతి రెండు బంతులకు ఒక పరుగే రావడంతో అభిమానుల్లో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. కాకపోతే ఇద్దరు హిట్టర్లు హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్‌ క్రీజులో ఉండటం ప్రేక్షకులకు కాస్త ఊరట కలిగించింది. ఓ బంతికి కార్తిక్ సింగిల్‌ కోసం రమ్మని పిలిచినా.. ఏ మాత్రం బెదరని పాండ్యా..” నేను చూసుకుంటా.. వదిలేయ్” అన్నట్లు తల ఊపడం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చివరి ఓవర్‌లో నాలుగో బంతికి పవర్‌ఫుల్ షాట్ కొట్టాడు. అది బౌండరీ లైన్‌ ఆవల పడటం.. టీమ్‌ఇండియా అభిమానులు కేరింతలు కొట్టడం చకచకా జరిగిపోయాయి. దీనితో టీమిండియా ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యను నాన్‌స్ట్రైకింగ్‌లోని దినేశ్‌ కార్తిక్‌ ‘టేక్‌ ఏ బౌ’ అంటూ అభినందించాడు. భారత్ ఘన విజయాన్ని సాధించడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. చివరకు హార్దిక్ పాండ్యా తన చేతితో సంజ్ఞ చేయడం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here