తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు నిండిపోయి ఆస్థాన మండపం వరకు క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. తిరుమలలో సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వాతావరణం మారిపోవడంతో చిన్నపిల్లలతో వెళ్లినవారు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న శ్రీవారిని 87,478 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తులు 47,692 మంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.53 కోట్లు అని టీటీడీ తెలిపింది.
మరోవైపు ఎల్లుండి శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేసింది టీటీడీ. అలాగే ఈనెల 17వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం పుష్ప పల్లకిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు.
జూన్ నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 23.23 లక్షలుగా ఉంది. అదే విధంగా భారీ ఎత్తున హుండీలో కానుకలు వచ్చాయి. హుండీ ఆదాయం రూ.123.74 కోట్లగా ఉంది. జూన్ నెలలో విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 95.34 లక్షలు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 50.61 లక్షలు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 11.61 లక్షలని టీటీడీ తెలిపింది. రెండేళ్ల పాటు స్వామివారి దర్శనం పరిమిత సంఖ్యలోనే కల్పించారు.
కరోనా ఆంక్షలతో భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చాక సాధారణ రోజుల మాదిరిగానే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. రెండేళ్లుగా వేచిచూస్తున్న భక్తులు వెంకన్న దర్శనానికి పోటెత్తారు. మొక్కులు తీర్చుకునేందుకు క్యూ కట్టారు. దీనికి తోడు వేసవి సెలవులు కూడా కావడంతో కొండపై భక్తులు రద్దీ అమాంతం పెరిగింది.