శబరిమల అరవణ ప్రసాదం విక్రయాలు నిలిపివేత.. ఎందుకంటే?

0
316

శబరిమలలో అయ్యప్ప భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. శబరిమల ఆలయంలో పవిత్ర అరవణ ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. ప్రసాదం విక్రయాలను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రసాదం తయారీకి వాడిన యాలకుల్లో మోతాదుకు మించి రసాయనాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ నివేదిక ఇచ్చింది. దీంతో ఈ ప్రసాదం విక్రయాలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రసాదం తయారీ, అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని కేరళ హైకోర్టు బుధవారం ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డును ఆదేశించింది. ఈ యాలకులు లేకుండా తయారు చేసిన ప్రసాదం విక్రయించుకోవచ్చని కోర్టు సూచించింది.

కోర్టు ఆదేశాలతో బుధవారం సాయంత్రం నుంచి విక్రయాలు ఆగిపోయాయి. న్యాయస్థానం ఆదేశాలతో దాదాపు 6.5 లక్షల ప్రసాదం డబ్బాల పంపిణీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రసాదాల తయారీకి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రసాదం విక్రయం నిలిచిపోవడంతో భక్తులు నిరాశకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. అరవణ ప్రసాదంలో ఉపయోగించే యాలకులను ట్రావెన్‌కోర్‌ బోర్టు అంతకుముందు అయ్యప్ప స్పైసెస్‌ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. అయితే, 2022-23 సీజన్‌లో ఈ యాలకుల కాంట్రాక్టును కొల్లాంకు చెందిన ఓ సప్లయర్‌కు బోర్డు అక్రమంగా అప్పగించిందని అయ్యప్ప స్పైసెస్‌ కంపెనీ ఆరోపించింది. ఈ క్రమంలోనే యాలకుల నాణ్యతపై ఈ కంపెనీ ఫిర్యాదు చేయడంతో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్‌ ఇండియా లాబొరేటరీలో పరీక్షించారు. ఈ యాలకులు అసురక్షితమైనవిగా తేలాయి. కొల్లాం కంపెనీ సప్లయ్‌ చేసిన వాటిల్లో 14 రకాల రసాయనాలు మోతాదుకు మించి ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నివేదిక ఇచ్చింది.

ఈ వ్యవహారం కేరళ ఉన్నత న్యాయస్థానానికి చేరింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రసాదం విక్రయాలపై మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. నాణ్యత లేని, అసురక్షితమైన పదార్థాలను భక్తులకు విక్రయించడం సరికాదని… అలాంటి ప్రసాదాలను బోర్టు విక్రయించకూడదని కోర్టు వెల్లడించింది. అరవణ ప్రసాదాన్ని భక్తులకు విక్రయించకుండా ట్రావెన్‌కోర్‌ బోర్డుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రసాదం అమ్మకుండా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను జనవరి 13కు వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here