కోర్టు సంచలన తీర్పు.. చిట్ ఫండ్ కంపెనీ యజమానికి 250ఏళ్ల జైలు శిక్ష

0
173

చిట్ ఫండ్ కంపెనీ యజమానికి మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లా కోర్టు 250ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. చిట్ ఫండ్ కంపెనీని ప్రారంభించి కోట్లాది రూపాయలను ముంచిన సాయి ప్రసాద్ కంపెనీ డైరెక్టర్ కు 250 ఏళ్ల జైలు శిక్ష పడింది. అంతే కాదు ఈ కంపెనీ సెహోర్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష కూడా పడింది. 250 ఏళ్ల శిక్ష పడిన నిందితుడి పేరు బాలాసాహెబ్ భాప్కర్. భాప్కర్‌తో పాటు కంపెనీ సెహోర్ బ్రాంచ్‌లోని ఉద్యోగులు దీప్‌సింగ్ వర్మ, లఖన్‌లాల్ వర్మ, జితేంద్ర కుమార్, రాజేష్ పర్మార్‌లకు కూడా ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. సెహోర్ జిల్లా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ కుమార్ షాహి ఈ శిక్షను ఖరారు చేశారు. నిందితుడు బాలాసాహెబ్ భాప్కర్ సాయిప్రసాద్ పేరుతో చిట్ ఫండ్ కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ ద్వారా ఐదేళ్లలో డబ్బు రెట్టింపు చేస్తామని వినియోగదారులకు ఎర వేశారు. అతడి మాయలో పడి చాలా మంది ఈ చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు పెట్టుబడి పెట్టారు. అయితే డబ్బులు చెల్లించే సమయానికి ఉద్యోగులు కంపెనీకి తాళం వేసి పరారీ అయ్యారు. కంపెనీకి చెందిన కస్టమర్లు డబ్బులు వసూలు చేసేందుకు కంపెనీ కార్యాలయానికి చేరుకోగా.. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. ఈ కేసులో 2016లో సెహోర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఆర్‌ఐ నమోదైంది. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కంపెనీ డైరెక్టర్‌కి కోర్టు 250 ఏళ్ల శిక్ష విధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here