అదరగొట్టిన అమ్మాయిలు.. అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ మనదే

0
1353

అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మెగాటోర్నీలో భారత అమ్మాయిలు అదరగొట్టారు. యువ ఆటగాళ్లలో ప్రతిభ వెలికితీసేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తొలిసారి అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను ప్రవేశ పెట్టింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘనవిజయంతో ఫైనల్‌ చేరిన షఫాలీ బృందం.. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించింది. ఆదివారం జరిగిన తుదిపోరులో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ అండర్‌-19 బాలికల జట్టు.. 17.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది. నలుగురు ప్లేయర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. రియానా మెక్‌డొనాల్డ్‌ (19) టాప్‌ స్కోర్‌గా నిలిచింది. మన బౌలర్లలో టిటాస్‌ సధు, అర్చన దేవి, పార్షవి చోప్రా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. మన్నత్‌ కశ్యప్‌, షఫాలీ వర్మ, సోనమ్‌ యాదవ్‌ ఒక్కో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కెప్టెన్ షఫాలీ వర్మ 11 బంతుల్లో 15 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఓ ఫోర్, ఓ సిక్స్ బాదిన షఫాలీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేసింది. కానీ మూడో ఓవర్ తొలి బంతికే హన్నా బేకర్ బౌలింగ్‌లో అలెక్సా స్టోన్‌హౌస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటైంది. ఈ మెగా టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచిన మరో ఓపెనర్ శ్వేతా షెరావత్ (5) పరుగులకే ఔటై నిరాశపర్చింది. దీంతో 20 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. దీంతో మొట్టమొదటి అండర్-19 టీ20 వరల్డ్ కప్‌ను గెలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here