కామన్వెల్త్ గేమ్స్-2022లో చివరి రోజు భారత్ పతకాల పంట పండింది. ఈ గేమ్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గేమ్స్ రెండో రోజు నుంచే పతకాల వేట ప్రారంభించిన క్రీడాకారులు చివరి రోజు నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకుని ఘనంగా ముగించారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, మహిళల సింగిల్స్‌లో సింధు స్వర్ణ పతకాలు సాధించగా.. తాజాగా పురుషుల డబుల్స్ విభాగంలోనూ భారత్ మరో స్వర్ణం అందుకుంది. సాత్విక్ – చిరాగ్ శెట్టి జోడీ.. సీన్-బెన్ ద్వయంపై 21-15, 21-13 తేడాతో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. మరోవైపు టేబుల్ టెన్నిస్ విభాగంలో ఆచంట శరత్ కమల్ స్వర్ణం సాధించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్ పిచ్‌ఫోర్డ్ మీద 11-13, 11-7, 11-2, 11-6, 11-8తో శరత్ విజయం సాధించాడు.ఈ రోజు ఇప్పటివరకు పీవీ సింధు, లక్ష్య సేన్, సాత్విక్ – చిరాగ్ పసిడి పతకాలు సాధించారు. శరత్ తెచ్చిన పతకంతో ఈ రోజు స్వర్ణాల సంఖ్య నాలుగుకు చేరింది. హాకీ పురుషుల విభాగంలో ఫైనల్స్ చేరిన భారత జట్టు రజతంతో సరిపెట్టుకుంది.
భారత్ పతకాల సంఖ్య 61కి చేరగా, ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు ఉన్నాయి. భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. హాకీ పురుషుల విభాగంలో ఫైనల్స్ చేరిన భారత జట్టు పూర్తిగా నిరాశపర్చింది. తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా విఫలమైంది. ఈ మ్యాచ్‌లో నాలుగు క్వార్టర్లలోనూ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన ఆసీస్ జట్టు భారత్‌ను 8-0తో చిత్తుగా ఓడించింది. దీంతో ఆ జట్టు బంగారు పతకం కైవసం చేసుకోగా భారత్ రజతంతో సరిపెట్టుకుంది.
అయితే, గత ఎడిషన్‌తో పోలిస్తే మాత్రం భారత్‌కు ఈసారి నిరాశే ఎదురైందని చెప్పుకోవాలి. 2018లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 66 పతకాలు సాధించింది. ఇందులో 26 పసిడి పతకాలు, 20 రజతాలు, 20 కాంస్య పతకాలు ఉన్నాయి. మొత్తంగా 66 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. అప్పుడు కూడా ఆస్ట్రేలియానే టాప్ ప్లేస్‌లో నిలిచింది. 80 స్వర్ణాలు, 59 రజతాలు, 59 కాంస్యాలతో మొత్తంగా 198 పతకాలు గెలుచుకుంది. ఈసారి కూడా ఆస్ట్రేలియాదే అగ్రస్థానం అయినా ఆ దేశ పతకాల సంఖ్య కూడా తగ్గింది. 67 స్వర్ణాలు, 57రజతాలు, 54 కాంస్య పతకాలు సాధించింది. బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో 57 స్వర్ణాలు సహా 176 పతకాలు సాధించిన ఇంగ్లండ్ రెండో స్థానంలోను, 26 స్వర్ణాలు సహా 92 పతకాలు సాధించిన కెనడా మూడో స్థానంలో నిలిచింది. 61 పతకాలతో భారత్ ఆ తర్వాతి స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే, గత ఎడిషన్‌లో కెనడాను వెనక్కి నెట్టేసిన భారత్ ఈసారి మాత్రం కెనడా తర్వాతి స్థానంలో నిలిచింది.