ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం, చక్కెర ఎగుమతిపై ఆంక్షలను అక్టోబర్ 2023 వరకు ఒక సంవత్సరం పొడిగించినట్లు ప్రభుత్వం శుక్రవారం ఆలస్యంగా ఒక నోటిఫికేషన్లో తెలిపింది. మేలో రికార్డుల ఎగుమతుల తర్వాత దేశీయ ధరల పెరుగుదలను నియంత్రించడానికి భారతదేశం ఈ నెలాఖరు వరకు ఎగుమతులను పరిమితం చేసింది. భారతదేశం ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో చక్కెర పంటను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేయబడింది. దీని వలన న్యూఢిల్లీ 8 మిలియన్ టన్నుల వరకు ఎగుమతులు చేయవచ్చని ప్రభుత్వం, వ్యాపార వర్గాలు ఈ నెల మొదటివారంలో వెల్లడించాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చక్కెర ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది.
దేశంలో ద్రవ్యోల్భణం పెరుగుతుండటంతో నిత్యావసరాల ధరలు నానాటికి పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చక్కెర ధరలను నియంత్రించడంలో భాగంగా ఈ ఏడాది జూన్ 1 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు వరకు ఎగుమతులపై నిషేధం విధించింది. మరో రెండు రోజుల్లో ఈ గడువు ముగుస్తుండటంతో ఆంక్షలను మరో ఏడాదిపాటు పొడిగించింది. 2023 అక్టోబర్ వరకు నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశంలో చక్కెర ధరలను నియంత్రించవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలో చక్కెర ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉన్నది. గతకొన్నేండ్లుగా ప్రతి సంవత్సరం దేశం నుంచి చక్కెర ఎగుమతులు పెరుగుతూ వస్తున్నాయి.