క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రూర్కీ దగ్గర పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆయన ఉత్తరాఖండ్‌లోని రూర్కీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో తీవ్రంగా రిషబ్ పంత్ గాయపడ్డారు. ఆ ప్రమాదం నుంచి ఆయన ప్రాణాలతో బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
రిషబ్ పంత్ కాలుకు తీవ్రగాయాలు కాగా ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన తలకు కూడా గాయాలయ్యాయి. తన మెర్సిడిస్ బెంజ్ కారును స్వయంగా పంత్ నడుపుతున్నట్లు తెలిసింది. హరిద్వార్ జిల్లా మంగ్లౌర్-నర్సన్ మధ్య క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రూర్కీ సివిల్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. మంగళూర్ పీఎస్ పరిధిలోని ఎన్‌హెచ్-58లో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్ చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ అందించాలని అధికారులను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు.