ఢిల్లీ నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పాకిస్థాన్‌లోని కరాచీకి మళ్లించారు. అస్వస్థతకు గురైన ఒక ప్రయాణీకుడు ల్యాండింగ్‌లో మరణించినట్లు విమానాశ్రయ వైద్య బృందం ప్రకటించిందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా కరాచీలో అత్యవసర ల్యాండింగ్ చేసిన తర్వాత చనిపోయిన ప్రయాణికుడితో ఉన్న విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లింది. నైజీరియా దేశస్థుడైన ప్రయాణికుడిని రక్షించేందుకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు వర్గాలు చెబుతున్నాయి.
“విమానంలో వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా కరాచీకి మళ్లించబడింది. దురదృష్టవశాత్తు, అక్కడికి చేరుకోగానే, ప్రయాణీకుడు మరణించినట్లు విమానాశ్రయ వైద్య బృందం ప్రకటించింది. మేము ఈ వార్త విని చాలా బాధపడ్డాం. ప్రస్తుతం సంబంధిత అధికారులతో మాట్లాడి ఇతర ప్రయాణికుల ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాం. ”అని ఇండిగో తెలిపింది.
కరాచీలోని సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి ఒకరు భారతీయ విమానయాన సంస్థకు చెందిన విమానం ఢిల్లీ నుండి దుబాయ్‌కి వెళుతుండగా, విమానం మధ్యలో ఒక ప్రయాణికుడి ఆరోగ్యం మరింత దిగజారిందని ధృవీకరించారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇండిగో ఫ్లైట్ పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనుమతిని కోరాడు. కరాచీ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ దానిని మంజూరు చేశారు. దీంతో విమానం అక్కడ ల్యాండ్ అయింది. కానీ ప్రయాణికుడు విమానం ల్యాండ్ కాగానే ప్రాణాలు కోల్పోయాడు.