విద్యార్థులు తప్పు చేస్తే గురువులు దండించడం సహజమే. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే అప్పుడప్పుడు ఉపాధ్యాయులు చేయి చేసుకుంటారు. కానీ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని ఓ కళాశాల ప్రిన్సిపాల్ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చాడో ఎమ్మెల్యే. ఈ ఘటన కర్ణాటకలోని మండ్యలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కర్ణాటకలోని మండ్య నియోజకవర్గానికి చెందిన జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ జూన్ 20వ తేదీన మాండ్యాలోని నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కాలేజీలో జరుగుతున్న కంప్యూటర్ ల్యాబ్‌కు సంబంధించిన పనుల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. ఈ క్రమంలో కాలేజీ ప్రిన్స్‌పాల్.. ఎమ్మెల్యే అడిగిన ప్రతీ ప్రశ్నకి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అంతే కళాశాల సిబ్బంది, ప్రజల ముందే సదరు ప్రిన్సిపాల్‌ను చెంప దెబ్బలు కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చదువు చెప్పే గురువుపై చేయి చేసుకోవడం ఏంటని కర్ణాటకలోని ఉద్యోగ సంఘాలు ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.