దేశాభివృద్దిలో భాగస్వాములు కండి.. కిషన్ రెడ్డి పిలుపు

0
1001

కేంద్ర ప్రభుత్వంలో పని చేయడం అదృష్టంగా భావిస్తూ.. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రోజ్ గార్ మేళాలో కొత్తగా నియామకపత్రాలు పొందిన అభ్యర్థులకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పగలు, రాత్రి కష్టపడి ఉద్యోగాలు సంపాదించేందుకు సహకరించిన తల్లిదండ్రులను మరిచిపోవద్దని ఆయన అభ్యర్థులకు సూచించారు. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన 71 వేల మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రోజ్ గార్ మేళా ను వర్చువల్ గా ఢిల్లీ నుంచి ప్రారంభించారు. సికింద్రాబాద్ లోని స్వామి వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీ అందరికీ ఇది సంతోషకరమైన రోజు. ప్రధాన మంత్రి గారు ఇంతకు ముందు జరిగిన ఇంటరాక్షన్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. మీ తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని కష్టపడి చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను కూడా వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.ప్రధాన మంత్రి ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ ‘2047 నాటికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది. అప్పుడు మేము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఉంటారు. నేటి ఈ దేశ యువత ఉంటుంది. 2047 నాటికి మన దేశం ఎలా ఉండాలి, ఏయే రంగాల్లో ఎలాంటి అభివృద్ధి సాధించాలనేది మీపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి’ అన్న విషయాన్ని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు.

గత ఎనిమిదేండ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో మన దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి, స్వావలంబన సాధించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా, అటల్ ల్యాబ్స్, కౌశల్ యోజన వంటి కార్యక్రమాల ద్వారా యువత, మహిళలకు సాధికారత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు. 2014కు ముందు 98 శాతం మొబైల్ ఫోన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. కానీ ఈరోజు రూ.50 వేల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఒకప్పుడు వ్యాక్సిన్ల కోసం భారతదేశం ఎదురు చూసేదని కానీ కరోనా కష్టకాలంలో స్వదేశీ తయారీ వాక్సిన్ దేశీయ అవసరాలు తీర్చడంతోపాటు యావత్ ప్రపంచానికి ధైర్యాన్ని ఇచ్చిన విషయాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ రంగాల అధికారులు, కాలేజీ యాజమాన్యం, బోధన, బోధనేతర సిబ్బంది, నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here