ముందు నీ సంగతి చూసుకో.. పార్టీ టికెట్‌ కూడా కష్టమే..!

0
46

మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని ఎమ్మేల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పడం చాలా బాధాకరమన్న ఆయన.. అనిల్ నువ్వు ఓడిపోతున్నావు.. ముందు అది చూసుకో అని సూచించారు. నీకు నోరు ఉందనే సీఎం మంత్రి పదవి ఇచ్చారన్న ఆయన.. నెల్లూరు జిల్లా నుంచి మేం ముగ్గురం నూటికి నూరుపాళ్లు ఎమ్మెల్యేలుగా గెలుస్తాం, రాబోయే ఎన్నికల్లో మీరే చూస్తారు కదా? అని సవాల్‌ చేశారు.

పార్టీ భ్రమలో మీరు మాట్లాడుతున్నారు.. కచ్చితంగా ప్రభుత్వం మారుతుంది, వైసీపీ ఓడిపోతుంది అని జోస్యం చెప్పారు మేకపాటి.. పోయిన ఎన్నికల్లో సింగిల్ డిజిట్ తో అనిల్ గెలిచాడని ఎద్దేవా చేసిన ఆయన.. అది మర్చిపోయినట్లుగా ఉన్నారు. కాస్త గుర్తుంచుకోండి అని సలహా ఇచ్చారు. మమ్మల్ని సస్పెండ్‌ చేశారు.. కానీ, నీకు పార్టీ టికెట్లు ఇవ్వరని ప్రచారం జరుగుతోంది.. నీది నువ్వు చూసుకో ముందు అని సూచించారు.. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగానే ఓటు వేశాను అని మరోసారి స్పష్టం చేశారు మేకపాటి.. రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ నాకు ఇవ్వనని సీఎం వైఎస్‌ జగన్ చెప్పారు.. వేరే, వ్యక్తికి ఇస్తున్నాం.. అతనికి మద్దతు తెలపాలని అన్నారు.. అయితే, పార్టీకి పనిచేసిన వారిని.. వెన్నుపోటు పొడిచే వారిని మంచి నేతలు అనరు అంటూ మండిపడ్డారు.. పార్టీ టికెట్ అడిగితే నన్ను సస్పెండ్ చేయడం సీఎం గారికి న్యాయం కాదన్నారు.

మమ్మల్ని సస్పెండ్ చేసి మాపైనే అట్రాసిటీ కేసులు పెట్టించమని సజ్జల చెప్పటం చాలా గొప్పతనం అంటూ ఎద్దేవా చేశారు.. రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు.. బీటెక్ రవి నాకు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారనే ఆరోపణలు నిజం కాదన్నారు చంద్రశేఖర్‌రెడ్డి.. మేకపాటి కుటుంబం మీ కోసం పదవులకు రాజీనామా చేసింది, మీకు ఆర్థికంగా ఉపయోగపడ్డ వ్యక్తులం మేం అన్నారు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి.. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. ఇక, రెబల్ ఎమ్మెల్యేలపై అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఇది రాసిపెట్టుకోండి… ఒకవేళ అలాకాకుండా..? వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే తాను రాజకీయాలు వదిలేస్తానంటూ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here