నెల్లూరు కోర్టులో జరిగిన చోరీపై సిబిఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా కేసుకు సంబంధించి మొదట పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సి.బి.ఐ. అధికారులు గంటకు పైగా విచారించారు. మరిన్ని వివరాల కోసం మరోసారి సోమిరెడ్డిని విచారించి ఆయన నుంచి లిఖిత పూర్వకంగా సమాధానాలను రికార్డ్ చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన నెల్లూరు కోర్టులో చోరీ కేసు కు సంబంధించి చెన్నైలోని సి.బి.ఐ. అధికారుల బృందం నెల్లూరులో విచారణను చేపట్టింది. టిడిపి నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో భారీగా ఆస్తులు..వివిధ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి 2016 డిసెంబర్ లో ఆరోపించారు. దీనికి సంబంధించి కొన్ని పత్రాలను కూడా ఆయన విడుదల చేశారు.. తన ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు మంత్రి కాకుండా అడ్డుకునేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని ఈ విషయంపై విచారణ జరిపించాలని నెల్లూరు రూరల్ పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు.. దీంతో పోలీసులు ఈ కేసును విచారించి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన పత్రాలు నకిలీవని తేల్చారు. అంతేకాకుండా పసుపులేటి చిరంజీవి.. హరిహరన్.. వెంకటకృష్ణన్ ల తోపాటు కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా నిందితులుగా చేర్చారు.
ఈ కేసుకు సంబంధించి నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న రబ్బర్ స్టాంపులు.. లాప్ టాప్.. ప్రింటర్లు.. స్కానర్లు సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో కేసు విచారణ జరుగుతుండడంతో ఈ సాక్షాధారాలన్నీ ఒక బ్యాగులో ఉంచి కోర్టుకు అప్పజెప్పారు. ఈ కేసును విజయవాడలోని ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోంది. కరోనా తర్వాత విచారణ మొదలుకావడంతో ఈ సాక్షాలను ప్రత్యేక కోర్టుకు పంపాల్సి ఉంది. కానీ గత ఏడాది ఏప్రిల్ 13న నెల్లూరు కోర్టులో ఉంచిన ఈ సాక్షాధారాల బ్యాగ్ చోరీకి గురైంది. ఈ చోరీ కి సంబంధించి రాష్ట్ర హైకోర్టుకు. జిల్లా జడ్జి ఫిర్యాదు చేసింది. దీంతో సుమోటోగా కేసును స్వీకరించిన రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. చోరీకి సంబంధించి నెల్లూరు పోలీసులు జరిపిన విచారణతో సంతృప్తి చెందని హైకోర్టు పూర్తిస్థాయిలో విచారణ కోసం సి బి.ఐ. కి అప్పగించింది. దీంతో సి.బి.ఐ. అధికారులు గత నెలలో నెల్లూరుకి వచ్చి ప్రాథమిక విచారణ చేశారు.
కోర్టులో చోరీకి పాల్పడిన నిందితులు…కోర్టు క్లర్క్ తోపాటు కేసు నమోదు చేసిన చిన్న బజార్ పోలీసుల విచారించి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కేసు పూర్వపరాల కోసం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని విచారణ రావాలని సి.బి.ఐ. అధికారులు కోరారు. సి.బి.ఐ. ఎస్పీ నిర్మలాదేవి.. అదనపు ఎస్పీ అనంతకృష్ణన్ నేతృత్వంలోని సి.బి.ఐ. బృందం గంట 15 నిమిషాల పాటు సోమిరెడ్డిని ప్రశ్నించి వివరాలు తెలుసుకుంది. మళ్లీ రెండోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సోమిరెడ్డికి అధికారులు తెలిపారు. సోమవారం లేదా మంగళవారం నిర్వహించే విచారణ కోసం నోటీసులు జారీ చేస్తామని అప్పుడు లిఖితపూర్వకంగా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని సోమిరెడ్డికి తెలియజేశారు. విచారణ అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ సి బి ఐ. విచారణ పై తనకు పూర్తిస్థాయిలో నమ్మకముందని. నిందితులు ఎవరూ ఈ కేసులో నుంచి తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు.. మరోసారి విచారణ సందర్భంగా పూర్తిస్థాయిలో వివరాలు అందిస్తానని ఆయన చెప్పారు.