తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నగరంలో వివిధ ప్రాంతాల్లో బండి పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. హైదరాబాద్ కాప్రా సర్కిల్ కుషాయిగూడలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని తెలిపారు.
నాలుగవ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజా సంగ్రామ యాత్ర చేపడతారని తెలిపారు. రేపు, ఎల్లుండి ఉప్పల్ నియోజక వర్గంలో విస్తృతంగా పర్యిటిస్తారని ఆయన అన్నారు. బండి సంజయ్ కు ప్రజలు బ్రహ్మం రథం పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో వివిధ సామాజిక సమస్యలను ప్రజలు బండి సంజయ్ కి వివరిస్తున్నారని తెలిపారు. ఎన్నో ఆశలు పెట్టుకొని నిధులు, నీళ్ళు, నియామకాల కోసం ప్రజలు రెండో సారి సీఎం కేసీఆర్ కు అవకాశం ఇచ్చారన్నారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి అభివృద్ది చేయలేదన్నారు. అలాగే ఎంబీసీలకు 1000 కోట్లు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ ను నియమించి కూడా కనీసం 150 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని దుయ్యబట్టారు. ఇప్పటివరకు ఉప్పల్ నియోజకవర్గంలో అయిదుగురికి కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదన్నారు. అభివృద్ది విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నాయకులు పాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఇంత వరకు ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, నాచారం, కాప్రా, చర్లపల్లి తదితర ప్రాంతాల్లోని ఒక్క చెరువును కూడా పర్యాటకంగా అభివృద్ది పరచలేదని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొని స్వాగతం పలకాలని ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కోరారు.