టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ కు ఊరట లభించింది. లోకేష్ పాదయాత్రకు అనుమతి లభించింది. షరతులతో నారా లోకేష్ పాదయాత్రకు అనుమతి మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ సాయంత్రంలోగా చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి నుంచి అధికారిక ప్రకటన రానుంది. నిబంధనలకు లోబడి పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయబోవద్దని షరతులు విధించే అవకాశం వుంది. ఈ నెల 27న కుప్పం నుంచి ప్రారంభం కానుంది నారా లోకేష్ పాదయాత్ర. ఈనెల 26నే నారా లోకేష్ కుటుంబీకులతో కలిసి తిరుపతికి వచ్చే అవకాశం ఉంది.
నందమూరి, నారా కుటుంబాలు తిరుమల శ్రీవారిని దర్శించుకుని కుప్పంకు పయనం అవుతారని సమాచారం. 27న ఉదయం కుప్పంలో వరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి కమతమూరు క్రాస్ వద్ద బైపాస్ రోడ్డు పక్కన భారీ బహిరంగ సభకు నారా లోకేష్ హాజరవుతారు. సభ అనంతరం పాదయాత్ర ప్రారంభం అవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో మూడు రోజులపాటు కొనసాగుతుంది లోకేష్ పాదయాత్ర. దీనిపై అటు అధికార పార్టీ, ఇటు టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. లోకేష్ పాదయాత్రలకు ఎవరూ భయపడడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు.