తెలంగాణలో ఎండలు విజృంభిస్తుండగా… అటు ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో మూడు రోజులకు సంబంధించి వెదర్ రిపోర్ట్ విడుదల చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం ఈ ప్రాంతంలో పలుచోట్ల తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటి గ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూరీడు సెగలు కక్కుతున్నాడు. కాకినాడ, ఏలూరు, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని విపత్తుల శాఖ హెచ్చరించింది.