ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ పొత్తు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లు చర్చగా మారిపోయాయి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి సరైన సహకారం అందలేదు అనేది బీజేపీ ఆరోపణ.. జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టే అంటూ బీజేపీ నేత మాధవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఇక, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి సరైన సహకారం లేదంటూ సోము వీర్రాజు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అభ్యర్థులకు జనసేన నుంచి అందిన సహకారం ఎంత అనేది మీరే ఆలోచించుకోండి అంటూ మీడియాకు వదిలేశారు సోము వీర్రాజు.
ఇక, ప్రధాని నరేంద్ర మోడీ బాగా పని చేస్తారు.. ఏపీలో బీజేపీ మాత్రం ఎదగకూడదని అందరూ మాట్లాడుతున్నారని పరోక్షంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.. ఇక, ఈ వ్యాఖ్యలు ఏ ఒక్కరినో ఉద్దేశించినవి కావన్న ఆయన.. బీజేపీ-జనసేన విడిపోవాలనేది మీ కోరిక మాత్రమే అన్నారు. ఓ చిన్న మాట పట్టుకుని ఏదేదో ఊహించేస్తున్నారు.. మీ కోరిక ఫలించదన్నారు. మరోవైపు.. వైసీపీ-బీజేపీ కలిసి ఉన్నాయనేది ఓ అపోహ మాత్రమేనని కొట్టిపారేశారు వీర్రాజు.. నేను ప్రతి రోజూ వైసీపీని, సీఎం జగన్‌ను విమర్శిస్తూనే ఉన్నానని గుర్తుచేశారు. మాధవ్ వ్యాఖ్యలపై ఇంతకు మించి స్పందించనన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా పోరాటం చేస్తాం.. క్షేత్ర స్థాయిలో పోరాటాలకు ప్లాన్ చేస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీతో విశాఖలో జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ వేస్తామని తెలిపారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.