శ్రీశైలంలో శివుడికే శఠగోపం.. బోర్డు మెంబర్ దందా

0
990

శ్రీశైలం లో శివునికె శఠగోపం పెడుతున్నారా…..ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ ముసుగులో దర్శనాలు, అభిషేకాల దందా జరుగుతోంద… ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎందుకు వివాదాల్లో కూరుకుపోతున్నారు…ఇంతకీ శ్రీశైలం లో ఏమి జరుగుతోంది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు….శివుని చెంత చేరి సర్వపాపాలు కడుక్కోవాలని భక్తులు వేల కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు. శివుని కృప కోసం ఎంతో ఎంతో శ్రమిస్తారు. అలాంటి శివునికి సేవ చేసే అవకాశం ఎంతమందికి వస్తుంది…శ్రీశైలం ఆలయంలో ఉదోగులైనా, అధికారులైనా, పాలకవర్గం ప్రతినిధులైనా….స్వామి వారి సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు సంతోషించకుండా దందాకు తెర తీస్తున్నారా…..ప్రతిష్టకు పోయి ఆలయ ప్రతిష్ట రోడ్డుకీడుస్తున్నారా…అంటే ఇటీవల పరిణామాలు చూస్తే నిజమేననిపిస్తుంది.

శ్రీశైలం క్షేత్రంలో ఆడియో లీక్ కలకలం సృష్టించింది. ట్రస్ట్ బోర్డు మెంబెర్ గా ఉన్న పద్మజ ఆలయంలో అటెండర్ గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తితో ఫోన్ సంభాషణ విని సగటు భక్తులు నోరెళ్ళబెడుతున్నారు. అభిషేకాలు, స్పర్శ దర్శనాలతో వ్యాపారం చేసి తమకు ఆదాయం సమకూర్చితే ఎంత సంతోషంగా వుంటుందంటూ ట్రస్ట్ బోర్డు మహిళా సభ్యురాలు పద్మజ అటెండర్ తో ఫోన్ సంభాషణ వైరల్ అయింది. ఆలయంలో మల్లికార్జునస్వామికి అభిషేకాలు స్పర్శ దర్శనాల పేరుతో దోపిడీ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
స్వామివారి గర్భాలయ అభిషేకం టికెట్లు లేకపోయిన గర్భాలయ అభిషేకాలు చేయిస్తామని ట్రస్ట్ బోర్డు సభ్యురాలి ఫోన్ సంభాషణ అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఫోన్ సంభాషణ ఒకటే బయటికి వచ్చినా ఆలయంలో ఇలా కొందరు వ్యవహారం చక్కబెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్వామి వారి సేవ కోసం ఏర్పాటైన ట్రస్ట్ బోర్డు సభ్యులు సొంత సేవకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు దోపిడీకి కూడా తెరతీస్తే ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది.

అభిషేకాలు, దర్శనాల పేరుతో వ్యాపారంపై ఫోన్ సంభాషణ జరిపిన ట్రస్ట్ బోర్డు మెంబర్ పద్మజ ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదు. రాయచోటి జిల్లాకు చెందిన ఆమె ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. ఆడియో ఫేక్ అని ప్రైవేట్ సంభాషణల్లో చెప్పిన పద్మజ అంతకు మించి మాట్లాడడం లేదు. ఆడియో ఫేక్ అయితే ఆమెకు ఆడియో ఎవరు సృష్టించారు…ఆమెకు సంబంధించిన ఫోన్ ఆడియో ఎందుకు లీక్ చేశారు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు. పద్మజకు ఎవరైనా శత్రువులు ఉన్నారా…లేక ఈమె దర్శనాలు, అభిషేకాలు ఒత్తిడి భరించలేక ఫోన్ రికార్డు చేసి బయటపెట్టారా అనే చర్చ జరుగుతోంది. దీనిపై అధికారవర్గాలు కూడా మాట్లాడడానికి కానీ, నిజాలు నిగ్గు తెంచేందుకు కానీ ముందుకు రాలేదు.

ట్రస్ట్ బోర్డు మెంబర్ పద్మజ ఫోన్ ఆడియో లీక్ వ్యవహారానికి కొద్ది రోజుల ముందే ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి స్వామి , అమ్మవారి ప్రసాదాల తయారీకి అవసరమైన సరుకుల సరఫరాపై చెందిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.శ్రీశైలం దేవస్థానంలో ప్రసాదాల తయారీకి అవసరమైన సరుకులు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారని, కాంట్రాక్టర్ ను మార్చాలని చెప్పినా అధికారులు స్పందించడం లేదని చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి మీడియా సమక్షంలో చెప్పారు. దీనిపై విచారణ జరపాలని సీఎం ను కొరతానన్నారు. 15 ఏళ్లుగా ఒకే కాంట్రాక్టర్ ను కాంట్రాక్టు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

గత నవంబర్ లోనే సుమారు 42 లక్షలు అధికంగా చెల్లించారని ఆరోపించారు ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి .శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆరోపణలతో ఇద్దరు ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఈవో విభేదించారు. కెజీ నెయ్యి టెండర్ దారు టెండర్ ప్రకారం 489.60 కేటాయిస్తుండగా ప్రస్తుతం మార్కెట్ రేట్ 700 వందలు ఉందని గుర్తు చేసారాయన. ప్రతి నెల 40 వేల కేజీల నెయ్యి దేవస్థానం వినియోగిస్తుందని, దేవస్థానానికి ప్రతి నెల 80 లక్షలు ఆదా అవుతోందని లెక్కలు చెప్పారు ఈవో లవన్న. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా చైర్మన్ ఆరోపణలను కొట్టిపారేశారు. అంటే చైర్మన్ ఈ ఆరోపణలు ఎందుకు చేసినట్టు, అధికారులకు, ట్రస్ట్ బోర్డు కు సమన్వయం లేదనే విషయం బయ్యబయలైంది.

శ్రీశైలం ఆలయంలో గతంలో ఆర్జిత సేవ టికెట్ల కంబకోణం కూడా బయటపడింది. అభిషేకం టికెట్లలో కోటి 25 లక్షలు కుంభకోణం జరిగింది. ఆలయంలో పనిచేసే 30 మంది వరకు ఉద్యోగులు అరెస్టయ్యారు. అందులో 12 మంది రెగ్యులర్ ఉద్యోగులు కాగా మిగతా వారు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వున్నారు. రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేసి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. మొత్తమ్మీద శ్రీశైలం ఆలయం వివాదాలతో భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here