steal train engine: ఓ దొంగల ముఠా ఏకంగా ఓ రైలు ఇంజిన్నే మాయం చేసిన అరుదైన ఘటన బీహార్‌లో జరిగింది. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలోని గర్హారా రైల్వే యార్డ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు సొరంగం తవ్వి, రైలులోని మొత్తం డీజిల్ ఇంజిన్‌ను దొంగిలించారు. మరమ్మతుల కోసం యార్డులో ఉంచిన రైలు డీజిల్ ఇంజిన్‌ను దొంగిలించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. కొందరు దొంగలు వారం రోజుల్లో కొన్ని ముక్కలుగా చేసి ఎత్తుకుపోయారు. ఇంజిన్‌లోని పలు భాగాలను వివిధ జిల్లాల్లోని తుక్కు దుకాణాల్లో అమ్మేశారు. ఈ దొంగతనం చేసేందుకుఆ దొంగల ముఠా ప్రత్యేక సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, రైల్వే స్పెషల్ విజిలెన్స్ బృందం నవంబరు 18న గర్హరా పరిసర ప్రాంతాల్లోని కొన్ని స్క్రాప్ గోడౌన్లపై దాడులు చేసి కొన్ని ఇంజిన్ భాగాలను స్వాధీనం చేసుకున్నారు.
గర్హరా యార్డ్‌కు మరమ్మతుల కోసం తీసుకువచ్చిన డీజిల్ ఇంజిన్ దొంగిలించబడినందుకు బరౌని పోలీస్ స్టేషన్లో గత వారం కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్లు ముజఫర్‌పూర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ పీఎస్ దూబే తెలిపారు. విచారణలో ముగ్గురు అరెస్టయిన వ్యక్తులు రైల్వే యార్డుకు సొరంగం తవ్వారని, దాని ద్వారా ఇంజిన్ లోకోమోటివ్ భాగాలు, ఇతర వస్తువులను బస్తాల్లో తీసుకువెళ్లినట్లు చెప్పారు. దొంగల ముఠా నాయకుడు చందన్‌కుమార్‌తో పాటు.. మరో ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. వారిని విచారించి ముజఫర్‌పుర్ జిల్లాలోని ఓ గోదాముపై దాడి చేసి దాదాపు రూ.30 లక్షల విలువ చేసే 13 బస్తాల ఇంజిన్ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వ్యక్తులు విచారణలో తుక్కు దుకాణ యజమాని గురించి కూడా ప్రస్తావించారు. సమాచారం ఆధారంగా, ముజఫర్‌పూర్ జిల్లాలోని ప్రభాత్ నగర్ ప్రాంతంలోని స్క్రాప్ గోడౌన్లో సోదాలు నిర్వహించబడ్డాయి. అక్కడ నుండి రైళ్లలో ఉపయోగించే 13 బస్తాల నిండా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఇంజిన్ భాగాలు, పాతకాలపు రైలు ఇంజిన్ల చక్రాలు, భారీ ఇనుముతో చేసిన రైల్వే భాగాలు ఉన్నాయని దూబే చెప్పారు. స్క్రాప్ గోడౌన్ యజమాని కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠా స్టీల్ బ్రిడ్జిలను విప్పి వాటి భాగాలను దొంగిలించడంలోనూ నిమగ్నమై ఉంది.
గత సంవత్సరం, సమస్తిపూర్ లోకో డీజిల్ షెడ్‌కు చెందిన రైల్వే ఇంజనీర్‌ను పూర్నియా కోర్టు ఆవరణలో ఉంచిన పాత ఆవిరి ఇంజిన్‌ను విక్రయించారనే ఆరోపణలతో సస్పెండ్ చేశారు. ఇంజనీర్ ఇతర రైల్వే అధికారులు, భద్రతా సిబ్బందితో కలిసి ఇంజిన్‌ను విక్రయించడానికి సమస్తిపూర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ యొక్క నకిలీ లేఖను ఉపయోగించాడు.