Governor Tamilisai : బడ్జెట్‌ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం

0
1993

తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్‌కు మధ్య విభేదాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. అయితే.. రెండు వైపుల నుండి కొన్ని బలమైన వ్యాఖ్యలను వింటూనే ఉన్నాము. ఇటీవల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చర్చలో పాల్గొని గవర్నర్ కార్యాలయాన్ని అసలు అధికార పార్టీ గౌరవించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాక రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఆధిపత్య పోరు సాగింది. అయితే.. తాజాగా ఫిబ్రవరి 3న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యలు రాజ్ భవన్ కు తరలి వెళ్లారు.

గవర్నర్ ను కలిసి బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ ఆమెను లాంఛనంగా ఆహ్వానించారు. గత కొంతకాలంగా, బీఆర్ఎస్ నేతలకు, గవర్నర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోన్న తరుణంలో, ఈ ఆహ్వానం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండకపోవచ్చని ప్రచారం జరిగింది. అటు, గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలుపలేదంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. న్యాయస్థానం సూచనతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. రాజ్యాంగబద్ధంగా ముందుకెళతామని, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా గవర్నర్‌ తమిళిసైని అధికారికంగా బడ్జెట్‌ సమావేశాలకు ఆహ్వానించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here