ఏపీలో రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు. ఏపీ రాజకీయాల్లో అమరావతి పాదయాత్ర, విశాఖ గర్జన, పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ ఇప్పుడు హాట్ టాపిక్ లు.. కానీ మరో అంశం తెరమీదకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ యువ నేతలు వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ రాజమహేంద్రవరం వేదికగా కలిశారన్న వార్త ఆసక్తికరంగా మారింది. ఈ భేటీ రాజకీయంగా వివిధ అంశాలను తెరమీదకు తెచ్చింది. ఆదివారం రాత్రి ఈ ఇద్దరు యువ నేతలు రాజమహేంద్ర వరంలో భేటీ అయ్యారు. ఇదేం గాసిప్ కాదు.. స్వయంగా పరిటాల శ్రీరామ్ సోషల్ మీడియా వేదికగా దీనిని ప్రకటించారు. ఇద్దరూ చాలాసేపు వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది.
ఏపీలో వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరాం ఇద్దరు రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన కుటుంబాల నుంచి వచ్చారు. ఈ కుటుంబాలకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. అమరావతి రైతుల మహాపాదయాత్ర సోమవారం రాజమహేద్రవరంలోకి ప్రవేశించనుంది. ఈ ఇరువురు నేతలు అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతు తెలపనున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం వచ్చిన రాధా, శ్రీరామ్‌లు మరో యువనేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీశ్‌తో కలిసి సమావేశమయ్యారు. గతంలో వంగవీటి రాధకు పరిటాల శ్రీరామ్ మద్ధతుగా నిలిచారు. రాధాపై రెక్కీ జరిగిందన్న వార్తల నేపథ్యంలో శ్రీరామ్ అప్పట్లో తీవ్రంగా స్పందించారు. రాధాను ఎవరైనా టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచనలం సృష్టించాయి.