ఇదేం వైద్యం.. చెవి నొప్పి ఉందని ఆసుపత్రికి వెళ్తే.. చేయి కోల్పోయింది..

0
147

చెవినొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన ఓ యువతి తన ఎడమచేతిని కోల్పోయిన ఘటన బిహార్‌ రాజధాని పాట్నాలో జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం.. యువతి ప్రాణాలకే ముప్పును తెచ్చిపెట్టింది. శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ చెవినొప్పితో పాట్నాలోని మహావీర్‌ ఆరోగ్య సంస్థాన్‌ ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు జులై 11న శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఆమె ఎడమ చేతికి ఓ ఇంజక్షన్ ఇచ్చి పంపించారు. ఇంటికి వెళ్లిన రేఖ చేయి రంగు మారడంతోపాటు నొప్పిగా కూడా ఉండడంతో మళ్లీ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను కలిసి విషయం చెప్పింది. చూసిన వైద్యులు ఏమీ కాదని, తగ్గిపోతుందని చెప్పి పంపించేశారు.

వైద్యులు చెప్పినప్పటికీ మార్పు రాకపోవడంతో రేఖ పలు ఆసుపత్రుల్లో చూపించుకుంది. చివరికి పాట్నాలోని మేదాంత ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు చేతిని తొలగించాల్సిందేనని, లేదంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని చెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రేఖ కుటుంబ సభ్యుల అంగీకారంతో శస్త్ర చికిత్స చేసి ఎడమ చేతిని తొలగించారు. కాగా, రేఖకు ఇటీవల వివాహ నిశ్చితార్థమైంది. నవంబరులో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే ఆమె చేతిని కోల్పోవడంతో వరుడి తరపు వారు పెళ్లిని రద్దు చేసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ కూతురి జీవితం ఇలా అయిపోయిందని ఆ యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మహావీర్ ఆరోగ్య సంస్థాన్ ఆసుపత్రి గుర్తింపును రద్దు చేయాలని రేఖ కుటుంబం ఐఎంఏకు విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనకు మహావీర్ ఆరోగ్య సంస్థే కారణమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రేఖ కుటుంబీకులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here