వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారు.. ఎప్పుడైనా మా పార్టీలో చేరతారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్న మాట.. అయితే, ఈ ప్రచారాన్ని వైసీపీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీలో చేరే ప్రసక్తే లేదంటున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.. వచ్చే 2024 ఎన్నికల్లోనూ వైఎస్ జగనే ముఖ్యమంత్రి కావడం ఖాయం అంటున్నారు.. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న మంత్రి గుమ్మనూరు జయరాం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు పశువుల సంతలో కొన్నట్టు కొనడం ఆనాటి నుంచి వస్తున్న ఆనవాయితీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీలో చేరే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
చంద్రబాబు, లోకేష్ పాదయాత్రకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ పాదయాత్రకు చాలా తేడా ఉందన్నారు మంత్రి జయరాం.. పాదయాత్ర అంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్ కుటుంబానికే సొంతం అన్నారు.. చంద్రబాబు ప్రజలుకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పే ధైర్యం లేదన్న ఆయన.. 2024 ఎన్నికల్లోనూ వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. కాగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగేళ్లలో తొలిసారి మంత్రాలయం దర్శనానికి వచ్చారు జయరాం.. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం నేపథ్యంలో మంత్రి జయరాం మంత్రాలయం వెళ్లడం.. పీఠాధిపతి, మంత్రి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఎన్నిసార్లు సమాచారం పంపినా రాలేదని పీఠాధిపతి ప్రశ్నించారట.. అయితే, ఇప్పుడు రాఘవేంద్రస్వామి బలం కావాలని మంత్రి జయరాం కోరినట్టుగా తెలుస్తోంది.