క్రికెట్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్.. ఐపీఎల్‌ 2023పై సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన

0
588

క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అలాగే మహిళలకూ ప్రత్యేకం టీ-20 లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐకి భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఇప్పటికే వారికి టీ20 ఛాలెంజ్‌ పేరిట కొన్ని మ్యాచ్‌లను నిర్వహిస్తున్నప్పటికీ.. తమకూ ఇటువంటి లీగ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఆరంభంలో మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించాలని బోర్డు భావిస్తోందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మంగళవారం అన్ని రాష్ట్ర సంఘాలకు తెలిపారు. 2022-23 కోసం స్వదేశీ అంతర్జాతీయ, దేశీయ సీజన్‌పై ముఖ్యమైన అంశాలను వివరిస్తూ గంగూలీ అన్ని రాష్ట్ర సంఘాలకు లేఖ రాశారు. మహిళా ఐపీఎల్‌పై బీసీసీఐ కసరత్తు చేస్తోందని లేఖలో పేర్కొన్నాడు. “బీసీసీఐ ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్‌ కోసం పని చేస్తోంది. మేము వచ్చే ఏడాది ప్రారంభంలో మొదటి సీజన్‌ను ప్రారంభించాలని భావిస్తున్నాము” అని గంగూలీ లేఖలో తెలిపాడు. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని గంగూలీ లేఖలో పేర్కొన్నాడు.

పురుషుల ఐపీఎల్‌పై స్పందించిన గంగూలీ.. మరింత సమాచారం అవసరమైన సమయంలో ఇవ్వనున్నట్లు చెప్పాడు. వచ్చే ఏడాది నుంచి పురుషుల ఐపీఎల్‌ స్వదేశానికి తిరిగి వస్తుందని, మొత్తం పది జట్లు తమ హోం గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు ఆడుతాయని లేఖలో తెలిపాడు. 2020లో కరోనా విజృంభించినప్పటి నుంచి ఐపీఎల్‌ను ఎంపిక చేసిన వేదికల్లో మాత్రమే నిర్వహించిన విషయం తెలిసిందే. గత సీజన్‌ను రెండు విడుతలుగా నిర్వహించిన విషయం తెలిసిందే. రెండో విడతను యూఏఈలోని మూడు మైదానాల్లో మాత్రమే నిర్వహించగా.. 2021 ఐపీఎల్‌ మొదటి సగం మ్యాచ్‌లు ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, చెన్నైల్లో జరిగాయి. ప్రస్తుతం మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో పాత పద్ధతిలోనే నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇక ఆయా జట్లు సొంత గ్రౌండ్లలోనే మ్యాచ్‌లు ఆడనున్నాయి. పురుషుల ఐపీఎల్ హోమ్ అండ్ ఎవే ఫార్మాట్‌కు తిరిగి వెళ్తుందని కూడా అతను వెల్లడించాడు. గతేడాది ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు ముంబై, పుణెలలో నాలుగు వేదికలుగా జరగగా, నాకౌట్ మ్యాచ్‌లు కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో జరిగాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి తొలి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సీజన్​ నుంచి అండర్‌15 వన్డే టోర్నమెంట్‌ను ప్రారంభించబోతున్నట్లు సౌరవ్ గంగూలీ తెలిపారు.అంతర్జాతీయంగా మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోందన్నారు. మన జట్టు కూడా బాగా రాణిస్తోందని ఆయన అన్నారు. అందుకే ఈ కొత్త టోర్నీ ఈ సీజన్​ నుంచి ప్రారంభించబోతుందన్న ఆయన.. దీంతో కొత్త ఆటగాళ్లకు నేషనల్, ఇంటర్నేషనల్‌ లెవెల్లో రాణించడానికి ఈ టోర్నీ బాగా ఉపయోగపడుతుందని గంగాలీ చెప్పారు. ఈ టోర్నీని డిసెంబరు 26 నుంచి జనవరి 12 వరకు బెంగళూరు, రాంచీ, రాజ్‌కోట్​, ఇండోర్​, రాయ్‌పూర్‌​, పుణెలో నిర్వహించనున్నారు. రంజీ ట్రోఫీ కూడా ఎప్పటిలాగే.. ఇక నుంచి దేశవాళీ క్రికెట్‌లోని అన్ని టోర్నీలు కూడా హోమ్‌ అండ్​ అవే పద్ధతిలో జరుగుతుందని గంగూలీ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సీజన్‌లో రెండు ఇరానీ కప్‌లు జరుగుతాయని కూడా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here