ఐర్లాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ రికార్డ్ విజయమైతే నమోదు చేయగలిగింది కానీ.. ఇదే సమయంలో ఓ చెత్త రికార్డ్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది. అదే.. ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్ అవ్వడం! దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్‌లు తొలి బంతికే ఔటై వెనుదిరిగారు. టీ20ల్లో ఓ ఇన్నింగ్స్‌లో టీమిండియా తరఫున ఇన్ని గోల్డెన్ డకౌట్‌లు కావడం ఇదే మొదటిసారి.
కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా (57 బంతుల్లో 104) సెంచరీతో చెలరేగిపోయాడు. తనకు అంది వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగపరచుకున్నాడు. ఇతనితో పాటు సంజూ శాంసన్ కూడా విశ్వరూపం చూపించాడు. ఇండియాలో చోటు కోసం చాలాకాలం నుంచి తహతహలాడుతున్న అతగాడు.. ఎట్టకేలకు చాన్స్ రావడంతో అర్థశతకంతో మెరుపులు మెరిపించాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 77 పరుగులు చేశాడు. వీరి వల్లే భారత్ 225 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.
ఇక లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ కూడా అద్భుతంగా పోరాడింది. ఒకానొక దశలో ఈ జట్టు గెలుస్తుందని అంతా అనుకున్నారు. చివరి బంతి వరకూ పోరు హోరాహోరీగా సాగింది. కానీ, ఆఖరి బంతి వరకు వచ్చి ఐర్లాండ్ ఓటమిపాలైంది. ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సి ఉండగా.. ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌల్ చేసి కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. దీంతో.. ఐర్లాండ్ 4 పరుగుల తేడాతో ఓడింది. 20 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది.