India Won 3rd ODI Against Zimbabwe In Harare Sports Club: జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బారత్ 13 పరుగుల తేడాతో నెగ్గింది. ఒకానొక దశలో ఈ మ్యాచ్ జింబాబ్వే గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ, చివర్లో భారత బౌలర్లు ట్విస్ట్ ఇవ్వడంతో మ్యాచ్ భారత్ వశమైంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత్.. ఆరంభం నుంచే బాగా రాణించింది. ఓపెనర్లు శుబారంభం ఇచ్చారు. అయితే, ఆ వెంటనే పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభ్మన్ గిల్ (97 బంతుల్లో 130 పరుగులు), ఇషాన్ కిషన్ (61 బంతుల్లో 50 పరుగులు).. మరో వికెట్ పడకుండా భారీ భాగస్వామ్యమే జోడించారు. ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదారు. దీంతో శుభ్మన్ శతకం (తొలి అంతర్జాతీయ వన్డే సెంచరీ), ఇషాన్ అర్థశతకాలు పూర్తి చేసుకున్నారు. వీళ్లిద్దరు క్రీజులో కుదురుకోవడం వల్లే.. భారత్ 289 పరుగులు చేయగలిగింది. మిగతా బ్యాట్స్మన్లు అంతగా రాణించలేకపోయారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ ఐదు వికెట్లతో అదరహో అనిపించాడు.
ఇక 290 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన జింబాబ్వే.. మొదట్లో కాస్త తడబడింది. ఓపెనర్లు వెంటనే పెవిలియన్ చేరారు. అయితే.. సీన్ విలియన్స్ కాసేపు క్రీజులో కుదుర్కొని.. జట్టుకి ఊపు తీసుకొచ్చాడు. ఇక సికందర్ రాజా భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. చివర్లో ఇతనికి బ్రాడ్ ఇవాన్స్ కాసేపు తోడు ఇవ్వడంతో.. జింబాబ్వేనే మ్యాచ్ గెలుస్తుందని అందరూ భావించారు. కానీ, భారత బౌలర్లు స్వల్ప వ్యవధిలోనే ఆ ఇద్దరిని ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. 13 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఫలితంగా.. 3-0 తేడాతో భారత్ సిరీస్ నెగ్గింది.