రాణించిన కేఎల్ రాహుల్.. శ్రీలంకపై భారత్ విజయం.. సిరీస్ కైవసం

0
2921

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. లంక కుదిర్చిన 216 పరుగుల లక్ష్యాన్ని.. అతి కష్టం మీద భారత్ చేధించింది. టాపార్డర్ చేతులు ఎత్తేయడంతో.. కేఎల్ రాహుల్ (64) భారత్‌కి అండగా నిలిచాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి.. జట్టుని గెలుపు దిశగా నడిపించాడు. అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడి, కష్టాల్లో ఉన్న భారత్‌ని ఆదుకున్నాడు. ఆచితూచి రాణిస్తూ, చివరివరకూ క్రీజులోనే ఉంటూ, ఇతర ఆటగాళ్లతో మంచి పార్ట్నర్‌షిప్‌లు నెలకొల్పుతూ.. భారత్‌కి విజయాన్ని అందించాడు.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి కేవలం 215 పరుగులకే కుప్పకూలింది. మొదట్లో నువానిదు ఫెర్నాండో (50), కుసల్ మెండిల్ (34) కలిసి అద్భుతంగా రాణించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లెవ్వరూ సత్తా చాటలేకపోయారు. భారత బౌలర్ల దెబ్బకు.. క్రీజులోకి వచ్చినట్టే వచ్చి పెవిలియన్ బాట పట్టారు. మధ్యలో వచ్చిన దునిత్ (32) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు కానీ, మిగతా వాళ్లు చేతులెత్తేశారు. గత వన్డేలో సెంచరీతో చెలరేగిన షణక ఈ మ్యాచ్‌లో మళ్లీ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేస్తాడని భావిస్తే.. అతడు కూడా నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో.. శ్రీలంక జట్టు 39.4 ఓవర్లలోనే 215 పరుగులకి ఆలౌట్ అయ్యింది. బౌలర్లలో కుల్దీన్, సిరాజ్‌లు లంక బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు.

ఇక 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కి లంక బౌలర్లు గట్టి షాక్‌లే ఇచ్చారు. టాపార్డర్‌ని కుప్పకూల్చారు. ఈ దెబ్బకు టీమిండియా కష్టాల్లో పడింది. అప్పుడు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కలిసి జట్టుని ఆదుకున్నారు. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కి 75 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీరి పుణ్యమా అని, కష్టాల్లో ఉన్న భారత జట్టు గట్టెక్కింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ వెన్నెముకలాగా నిలబడ్డాడు. అక్షర్ పటేల్‌తోనూ అతడు మంచి పార్ట్నర్‌షిప్ జోడించాడు. చివరగా కుల్దీప్ యాదవ్‌తో కలిసి.. భారత్‌ని గెలిపించాడు. ఈ మ్యాచ్ గెలవడంతో.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ భారత్ కైవసం అయ్యింది. భారత్ స్కోర్: 219/6.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here