చెన్నై సూపర్ కింగ్స్ పై బ్యాన్.. తమిళనాడు అసెంబ్లీలో చర్చ..

0
157

తమిళనాడులో భాషాభిమానం, ప్రాంతీయాభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ భాషకు ఎలాంటి అగౌరవం వాటిల్లినా అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు భగ్గుమంటాయి. ముఖ్యంగా హిందీ మాట్లాడితే ఏదో పాపం చేసినట్లు చూస్తుంటారు కొందరు. ఇక జల్లికట్లు, తమిళ సాంప్రదాయాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకున్నా ఊరుకోరు. ఇంతటి అభిమానం ఉన్న తమిళనాడులో మరో వివాదం రాజుకుంటోంది. ఐపీఎల్ లో చాలా మంది ఫెవరెట్ టీం అయిన చెన్నై సూపర్ కింగ్స్ ను బ్యాన్ చేయాలని అక్కడి ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అందుకు కారణం సీఎస్కే జట్టులో ఒక్కరు కూడా తమిళనాడుకు చెందిన ఆటగాడు లేకపోవడమే. ప్రస్తుతం ఈ అంశం తమిళనాడు అసెంబ్లీని కుదిపేస్తోంది.

పాతాళి మక్కల్ కట్చి(పీఎంకే) పార్టీ శాసనసభ్యుడు, ధర్మపురి ఎమ్మెల్యే వెంకటేశ్వరన్ మాట్లాడుతూ.. సీఎస్కే జట్టును నిషేధించాలని డిమాండ్ చేశారు. తమిళనాడుకు చెందిన ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తమిళనాడులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆడనివ్వడం లేదన్నారు. తమిళనాడుకు చెందిన ఆటగాళ్లను పక్కనబెట్టి కేవలం తమ స్వలాభం కోసం తమిళనాడు జట్టుగా ప్రచారం చేసుకుంటూ తమిళుల నుంచి ఎక్కువ లాభం పొందుతోంది.అందుకే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం విధించాలని పాతాళి మక్కల్ కట్చి తరపున శాసనసభలో వినతి పత్రం అందించారు. అయితే ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి స్పందన రాలేదు.

ప్రస్తుతం 16వ విడత ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నాయి. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని సీఎస్కే జట్టు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడేళ్ల తరువాత చెన్నైలో మ్యాచులు ఆడుతుండటంతో భారీగా ఫ్యాన్స్ హజరవుతున్నారు. ఈ సారి కప్ కొట్టాలని సీఎస్కే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here